పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో గడువు పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, వాటి పరిధిలోని 2,996 వార్డులు, డివిజన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.
చరిత్రలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వెలుపల మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మేడారంలో జరిగిన ఈ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డెడికేషన్ కమిషన్ ఇప్పటికే నివేదిక సమర్పించడం, రిజర్వేషన్లు కూడా ఖరారవడం, అలాగే ఫిబ్రవరి చివరి వారం నుంచి వివిధ స్థాయిల్లో విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు పూర్తి చేయాలని మంత్రిమండలి భావించింది.
మేడారం జంపన్న వాగులో నిరంతరం నీరు ఉండే విధంగా రామప్ప, లక్నవరం నుంచి గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించేందుకు సంబంధించి 143 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మేడారం పుణ్యక్షేత్రం కోసం ఇప్పటికే 19 ఎకరాల భూ సేకరణ పూర్తి కాగా, మరో 20 లేదా 21 ఎకరాల భూమిని సేకరించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని మంత్రిమండలి తీర్మానించింది.
2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను సమగ్ర ప్రణాళికతో నిర్వహించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని పురాతన ప్రసిద్ధ దేవాలయాలను ఒక సర్క్యూట్ కింద ఏర్పాటు చేసి, వాటి అభివృద్ధి, ఈకో టూరిజం దృష్టితో నివేదిక అందించేందుకు ఒక కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయించారు.
మార్చి 31 నాటికి కన్సల్టెన్సీ అందించే నివేదికపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, మేడారంలో చేపట్టిన తరహాలోనే ఇతర దేవాలయాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసి, పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని మంత్రిమండలి అభిప్రాయపడింది.
ఎల్ అండ్ టీ సంస్థ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ అంశంపై సమగ్రంగా చర్చించిన మంత్రిమండలి, వచ్చే సమావేశం నాటికి తుది నిర్ణయం తీసుకోనుంది. ఈలోగా మెట్రో ఫేజ్–2లో భాగంగా A, B విస్తరణలకు సంబంధించిన భూసేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, అందుకు రూ. 2,787 కోట్లను కేటాయిస్తూ కేబినేట్ ఆమోదముద్ర వేసింది.
హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) నుంచి శిల్పా లేఔట్ వరకు సుమారు 9 కి.మీ. మేరకు హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది.
నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో లా కాలేజీ ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ధనసరి అనసూయ (సీతక్క) మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు…
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. గతంలో ఎన్నడూ హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ జరగలేదని అన్నారు. పొట్లపూర్ ఎత్తిపోతల పథకానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. ఎస్బీఐకి స్థలాల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.
వచ్చే ఏడాది జులై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయని అన్నారు. పుష్కరాలను అద్భుతంగా నిర్వహించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు. ఆ నదీ ఒడ్డున ఉండే ఆలయాలన్నింటినీ కలిపి టెంపుల్ సర్క్యూట్గా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు..
కుంభమేళాను తలపించేలా మేడారం జాతర..
మేడారం దేవాలయ అభివృద్ధికి సుమారు 19 ఎకరాలు కేటాయించామని, మరో 21 ఎకరాలను సేకరించబోతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. భవిష్యత్తులో మేడారాన్ని తిరుపతి, కుంభమేళాను తలపించేలా చేస్తామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో లా కాలేజీలో 24 కొత్త పోస్టులు, ఫార్మసీ కాలేజీలో మరో 28 కొత్త పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టుకు కూడా ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. అలాగే రాబోయే రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో మట్టిరోడ్లు కనిపించవన్నారు. హ్యామ్ రోడ్లకు సంబంధించి దాదాపు 6వేల కిలోమీటర్ల పనులను వేగవంతం చేయాలని, ఆర్అండ్బీ ద్వారా త్వరగా పనులు చేపట్టాలని నిర్ణయించామన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో కొత్తగా పొట్లాపూర్ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్టు చేసి, ములుగు జిల్లాలోని ఐదు గ్రామాలు, 30 చెరువులు, కుంటలను నింపడంతోపాటు 7500 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించనున్నట్లు పేర్కొన్నారు. రూ.143 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించ తలపెట్టినట్లు తెలిపారు. అలాగే జంపన్నవాగులో నిరంతరం నీరు ప్రవహించేలా రామప్ప చెరువు నుంచి పైప్లైన్ వేస్తామని సీఎం ప్రకటించం సంతోషకరమన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959.