స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం..!
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం ...
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదించింది. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 21(3)ని తొలిగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై, బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం..
స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 23న మరోసారి సమావేశం కావాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. న్యాయ నిపుణులతో చర్చించి, వారి అభిప్రాయాలతో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి గురువారం సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో హ్యామ్ విధానంలో మొదటి దశలో రూ.10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల్లో పోటీ చేయరాదన్న నిబంధనను తొలగించాలని కేబినెట్ తీర్మానించింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ పకడ్బందీగా అమలవుతున్నందున, ఇద్దరు పిల్లల నిబంధన అవసరం లేదని మంత్రివర్గం అభిప్రాయపడింది..