తెలంగాణ కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, గళాలను విప్పాల్సిన అవసరం ఉంది… సిఎం రేవంత్ రెడ్డి….

ఎప్పుడూ గెలిచిన వాళ్లు రాసుకునేదే చరిత్రగా ఉంటోంది.. కానీ, పోరాటంలో అమరులైన వారి గురించి కొంత నిర్లక్ష్యం, సమాచార లోపం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు..అది.. సాయుధ రైతాంగ పోరాటమైనా తొలి, మలి తెలంగాణ ఉద్యమమైనా.. సమిధలైన, అమరులైన వారి చరిత్ర కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వారి గురించే ఎక్కువ చర్చ జరుగుతోందన్నారు. చరిత్రకారులు వాస్తవాలను లిఖించకపోతే వారికి అన్యాయం జరగడంతో పాటు, సమాజానికి అసంపూర్తి సమాచారం చేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, గళాలను విప్పాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌- 2024’ను గురువారం సాయంత్రం సీఎం ప్రారంభించి ప్రసంగించారు.

”తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కవులు, కళాకారులు మనకు స్ఫూర్తినిచ్చారు. మలిదశ ఉద్యమంలో అందెశ్రీ, గద్దర్‌, గోరటి వెంకన్న, బండి యాదగిరి, గూడ అంజయ్యలాంటి ఎంతో మంది కవులు వారి సాహిత్యం ద్వారా పోరాటాలను నిర్మించడమే కాకుండా మా లాంటివారు వేదికలపై మాట్లాడేందుకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఇలాంటి పుస్తక ప్రదర్శన మన చరిత్రను భవిష్యత్‌ తరాలకు చేరవేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. నిజమైన చరిత్రను భావితరాలకు అందించే ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం సముచిత ప్రాధాన్యం ఇస్తుంది” అని సీఎం ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, బుక్‌ ఫెయిర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.