తెలంగాణలోని ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం..

తెలంగాణలోని ఐదు జిల్లాల్లో శనివారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరో 19 జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, 19 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది.

నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు : అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట,రంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.

కుమురం భీం, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్‌, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుమురం భీం, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్‌, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను అధికారులు జారీ చేశారు.

సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో వర్షం కురిసింది. చిలకలగూడ, సీతాఫల్మండి, మారేడ్పల్లి, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్ ప్రాంతాలలో వర్షం కురిసింది. దీంతో రహదారులపై వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది.

జాతీయ రహదారిపై భారీగా అలుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు జిల్లాల్లో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జలమయమైన ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు జాతీయ రహదారిపై భారీగా అలుగు పోస్తూ ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కాన్వాయ్కి సైతం తిప్పలు తప్పలేదు..