కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన..!
తన పార్టీ పేరు టీఆర్ఎస్
( తెలంగాణ రాష్ట్ర సేన) గా ప్రకటించిన కవిత
*తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో జరిగిన భారీ బహిరంగ సభలో తన పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని వెల్లడించారు. పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని అందుకే తాను టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టాల్సి వచ్చిందని కవిత వెల్లడించారు…
సభలో కవిత కొత్త పార్టీ పేరు , జెండాను ఆవిష్కరించారు. కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అని ప్రకటించారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుతో కూడిన జెండాను ఆవిష్కరించారు. మధ్యలో తెలంగాణ మ్యాప్, దానిపై TRS అనే అక్షరాలతో పార్టీ జెండాను రూపొందించారు. అనంతరం ప్రసంగించిన కవిత పార్టీ ఏర్పాటుకు దారితీసిన అంశాలను వెల్లడించారు. తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోవటంతోనే తాను తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
‘ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లైనా మన కలలు పూర్తిగా నెరవేరలేదు. ఉద్యమ నేత కేసీఆర్ గారి అభివృద్ధి రథం గాడి తప్పింది. గతంలో కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పుల్లో నేనూ భాగంగా ఉన్నా. తప్పుకి ఇప్పుడు క్షమాపణ చెబుతున్నా. తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నా. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది. నేను తెలంగాణలోని మూడున్నర కోట్ల మందికి అమ్మగా పరిణితి చెందాలని అనుకుంటున్నా. అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకుపోతుంది. ప్రజల కష్టాలు తీరుతాయి..