నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరుగుతుందని దక్షిణాదిలో కొన్ని పార్టీలు చేస్తున్న రాజకీయానికి కేంద్రం చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి..నిజానికి ఇప్పటి వరకూ నియోజకవర్గాల పునర్విభజన నిబంధనలు ఖరారు చేయలేదు. అయినా జనాభా తగ్గిపోయింది కాబట్టి.. సీట్లు తగ్గిపోతాయని అర్థం పర్థం లేని నివేదికలను చూపించి ఆందోళనలు చేయడం ప్రారంభించారు. జనాభా ఒక్కటే ప్రతిపదిక అయినా ఈశాన్య రాష్ట్రలకు అసలు సీట్లు ఉంటాయా అన్న ప్రశ్న వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు.
ఇప్పుడు కేంద్రం దేశంలో ఎలాంటి అసమానతలు లేకుండా ఉండేందుకు… జనాభా పెరుగుదల, తగ్గుదలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలోనూ ఇరవై శాతం సీట్లు పెంచాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా లోక్ సభ నియోజకవర్గాల్లో ఓటర్లు పదిలక్షలు దాటిపోయారు. ఇరవై లక్షల వరకూ ఉన్న నియోజకవర్గాలు ఎక్కువే. అందుకే .. ఇరవై శాతం పెంచితే.. ఆ నిష్ఫత్తి తగ్గే అవకాశం ఉంటుంది.
నియోజకవర్గాల పునర్విభజన అనేది ఖచ్చితంగా కత్తి మీద సాము లాంటిదే అనుకోవచ్చు. ఏకాభిప్రాయం సాధించడం కష్టం కూడా కావొచ్చు. భావోద్వేగాల రాజకీయాల్లో మాకు అన్యాయం జరిగిందని రెచ్చగొట్టే రాజకీయాలు నడుస్తున్న సమయంలో ఇలాంటివి మరీ ఎక్కువగా ఉంటాయి. అటు ఉత్తరాదిలో అయినా.. ఇటు దక్షిణాదిలో అయినా.. సీట్లు తక్కువగా పెంచారని గోల చేసేవాళ్లు ఉంటారు. కానీ అందరికీ ఇరవై శాతం అని ఖరారు చేయడం వల్ల ఇలాంటి సమస్యలు కొంత మేర తగ్గే అవకాశం ఉంది..జనాభా లెక్కలకు కేంద్రం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. అవి పూర్తి చేయగానే.. నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అప్పుడే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం కూడా ఉంటుంది…
తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) నియోజకవర్గాల సంఖ్య పెరగనుందా? పునర్విభజన కచ్చితంగా చేపడతారా? కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కదలిక వచ్చింది. కేంద్ర ప్రభుత్వం జన గణనకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో తప్పనిసరిగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని ప్రచారం సాగుతోంది. జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టనున్నారు. తద్వారా నియోజకవర్గాల పెంపు, రిజర్వేషన్ల కేటాయింపునకు ఈ రెండు అంశాలు దోహదపడతాయని భావిస్తున్నారు. కులగణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. తరువాత పునర్విభజన ప్రక్రియ చేపట్టి 2029 ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది..!