కథువా ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు పౌరులను బందీలుగా పట్టుకొనే ప్రయత్నం చేసినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనాలు చెబుతున్నాయి..దాదాపు ఆరుగురు ఉగ్రవాదులు కథువా అడవుల్లో నక్కినట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. స్థానికంగా పుల్లలు ఏరుకొనే ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో ఆ ప్రదేశాన్ని భద్రతా దళాలు చుట్టుమట్టి.. గాలింపు ఆపరేషన్ చేపట్టాయి…సన్యల్ అనే గ్రామానికి చెందిన అనితాదేవి అనే మహిళ సమీపంలోని ఓ నర్సరీ వద్ద పుల్లలు ఏరుకొనేందుకు వెళ్లింది. అక్కడే ఉన్న ఢోక్లో కొందరు ఉగ్రవాదులు తన భర్తకు తుపాకులు గురిపెట్టి.. తనను కూడా దగ్గరకు రమ్మని పిలిచారని పేర్కొంది. కానీ, తన భర్త మాత్రం పారిపో అని సంకేతాలు ఇవ్వడంతో.. ఒక్కసారిగా పరుగు అందుకొని.. పెద్దగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల గడ్డి కోసుకొనే మరో ఇద్దరు అక్కడికి చేరుకొన్నారని ఆమె పీటీఐకు వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 4.30 సమయంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఉగ్రవాదులు పొడవైన గడ్డాలతో, కమాండో దుస్తుల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఈ సమాచారం తెలుసుకొన్న భద్రతా దళాలు ఆ నర్సరీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఉగ్రవాదుల సమాచారం తెలుసుకొన్న పోలీస్ బృందం, స్పెషల్ ఆపరేషన్ టీమ్ అక్కడికి చేరుకోగా.. వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ మొదలైంది. దీనిలో దాదాపు 250 తూటాలు కాల్చినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో చిన్నారికి తూటా తగిలింది. దీంతో ఆ బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామం మొత్తం భయం గుప్పిట ఉండిపోయింది. దీంతో అక్కడికి డ్రోన్లు, జాగిలాలు, కమాండోలు సహా అదనపు బలగాలను తరలించినట్లు డీజీపీ నళిన్ ప్రభాత్ పేర్కొన్నారు. ఉగ్రవాదులు మొత్తం రెండు గ్రూపులుగా ఆరుగురు వరకు ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ వద్ద సమాచారం ఉంది.ఇటీవల కాలంలో భారత్లో చొరబడే పాక్ ఉగ్రవాదులకు కథువా ప్రధాన మార్గంగా ఉంది. ఇక్కడినుంచి ఉధమ్పుర్, డోడా, కిష్టవార్ జిల్లాలకు వెళుతుంటారు….