తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం.. ఆ బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిర్ణయం…!

గతంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ స్కూటీలు బైకులు వరుస ప్రమాదాలకు గురైన సంగతి అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం తెలంగాణ Telangana రాష్ట్రంలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఎలక్ట్రికల్ బస్సుల అగ్నిప్రమాదాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూట్లలో నడుస్తున్న జేబీఎం (JBM) సంస్థకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు ప్రకటించారు. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం (NEBP) కింద పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్డెక్కిన ఈ జేబీఎం బస్సుల్లో వరుసగా హై వోల్టేజీ బ్యాటరీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు సాంకేతిక నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్ట్యా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది….గత నెల జూన్ 21న ఉదయం కరీంనగర్ సమీపంలోని అలుగునూర్ వద్ద జరిగిన ఎలక్ట్రిక్ బస్సు అగ్నిప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక రాకముందే మరో ప్రమాదం జరగడం ఆర్టీసీని అప్రమత్తం చేసింది. ప్రయాణికులు, డ్రైవర్లు, సిబ్బంది, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో జేబీఎం సంస్థను పలు కీలక అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆర్టీసీ కోరింది. ప్రమాదాలపై సాంకేతిక విశ్లేషణ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకునే శాశ్వత నివారణ చర్యలు, బ్యాటరీ ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రం, హైదరాబాద్ బస్ భవన్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు వంటి అంశాలపై పూర్తి వివరాలు అందించాలని సూచించింది.