కేజ్రీవాల్ ను అభినందించిన మోదీ..
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పంజాబ్ సంక్షేమం కోసం కేంద్రం అన్నివిధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు.ఈ మేరకు ఆయన ఓ ట్వీట్లో ఆప్‌ను, అరవింద్ కేజ్రీవాల్‌ను అభినందించారు. పంజాబ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించగలరని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. మోదీ ట్వీట్‌కు కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. ‘థాంక్యూ సార్’ అంటూ ట్వీట్ చేశారు. 117 సీట్ల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 సీట్లు గెలుచుకుని అధికార కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. బీజేపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది..
తెలంగాణలో కొత్తగా 90 కరోనా కేసులు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 25,658 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా 90 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే మరో 172 మంది బాధితులు కోలుకున్నారు. మరణాలేమీ సంభవించలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 1141 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి…
తెలంగాణలో మైనారిటీ గురుకులాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల..
తెలంగాణలో మైనారిటీ గురుకులాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మైనారిటీ గురుకులాల్లోని 5, 6, 7, 8 తరగతులు, ఇంటర్ ప్రవేశాల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9న ఐదో తరగతి ప్రవేశ పరీక్ష, మే 10న 6, 7, 8 తరగతులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మే 21న ఇంటర్ ప్రవేశాలకు పరీక్ష జరగనుంది…
హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని 1 నుంచి 8 తరగతుల్లోని విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనను ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభలో వెల్లడించారు. 2023 -24 విద్యాసంవత్సరంలో 9వ తరగతి, 2024 -25 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతుల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనను ప్రారంభించనున్నామన్నారు. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాల మేరకు విద్యాశాఖకు ఆదేశాలిచ్చామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి కార్యక్రమంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. ఇంగ్లీష్ మీడియాన్ని విప్లవాత్మక మార్పుగా సబితా ఇంద్రారెడ్డి అభివర్ణించారు. తాజా పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం హోదాకు చిహ్నంగా మారిందని, ఈ మీడియంలో చదివితేనే ఉద్యోగాలొస్తాయన్న భావన సమాజంలో నెలకొన్నదన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని తల్లిదండ్రులు సైతం కడుపుకట్టుకుని తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారని.. అందరి ఆకాంక్ష మేరకు ఇంగ్లీష్ మీడియాన్ని సర్కారు స్కూళ్లల్లో ప్రారంభిస్తున్నామన్నారు. ఇందుకోసం ద్విభాషా పుస్తకాలను సిద్ధంచేశామని, ఈ నెల 14వ తేదీ నుంచి టీచర్లకు శిక్షణనివ్వనున్నామన్నారు.
*కేసీఆర్ నాయకత్వంలో విద్యాయజ్ఞం..*
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈ నెల 8వ తేదీన విద్యాయజ్ఞానికి శ్రీకారం చుట్టామని మంత్రి సభకు వివరించారు. మన ఊరు మన బడి -మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా విద్యాయజ్ఞం ప్రారంభమయ్యిందన్నారు. మండలం యూనిట్‌గా అత్యదిక విద్యార్థులు నమోదైన 9,123 స్కూళ్లను మొదటి దశలో ఎంపిక చేశామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. రూ. 2 లక్షలు విరాళాలిస్తే ఎస్ఎంసీ కమిటీలో సభ్యత్వం, రూ.10 లక్షల విరాళమిస్తే ఒక తరగతి గదికి, రూ. 25 లక్షలిస్తే ప్రాథమిక పాఠశాలకు, రూ. 50 లక్షలిస్తే ప్రాథమికోన్నత పాఠశాలకు, కోటి రూపాయాలిస్తే ఉన్నత పాఠశాలకు వారి పేర్లు లేదా దాతలు సూచించిన పేర్లను పెడతామన్నారు. ఎంపిక చేసిన స్కూళ్ల పేర్లను మార్చాల్సి వస్తే, సంబంధిత జిల్లాల మంత్రులను సంప్రదించాలని, రెండో దశలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని స్కూళ్లను ఎంపిక చేస్తామన్నారు. త్వరలోనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని, పాత విద్యాకమిటీలనే కొనసాగిస్తామని, మధ్యాహ్న భోజన పథకం బకాయిలను త్వరలోనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మత కల్లోలాలు లేవు.. ప్రజలందరూ ప్రశాంతంగా నిద్ర పోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మత కల్లోలాలు లేవు.. ప్రజలందరూ ప్రశాంతంగా నిద్ర పోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. పోలీసులు సమర్థవంతంగా పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కిరణ్ మాట్లాడారు…నేరాలను అరికట్టడంలో, నేరస్తులను అరెస్టు చేయడంలో మన పోలీసులు దేశంలోనే నంబర్ వన్‌లో ఉన్నారని తెలిపారు. హైదరాబాద్‌లో కర్ఫ్యూ అనే పదమే వినపడట్లేదు. పోలీసులు ఆన్లైన్లో ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. నేరం జరిగిన ప్రాంతానికి పోలీసులు 5 నిమిషాల్లో చేరుకుంటున్నారు. నేరస్తులను అతి తక్కువ సమయంలోనే పట్టుకుంటున్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. స్వరాష్ట్రంలో నేరాలు బాగా తగ్గిపోయాయి. పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని క్రాంతి కిరణ్ స్పష్టం చేశారు…
యాదాద్రి ఆలయానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విరాళం..
యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడనికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆలోల ఇంద్రకరణ్ రెడ్డి రూ. 99,08, 454 విరాళం సమర్పించారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలాలయంలో నిర్వహించిన కల్యాణ వేడుకలో శుక్రవారం తన కుటుంబంతో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కు విరాళం చెక్కు, నగదును అందజేశారు. అంతకు ముందు స్వామివారి తిరు కల్యాణానికి ప్రభుత్వం తరుపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి దంపతులతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు…
గంజాయి గ్యాంగ్ అరెస్టు….అరెస్టు అయిన వారిలో 10మంది వ్యక్తులలో 9మంది స్టూడెంట్స్..
ఏపీ..గుంటూరు సిటీలో గంజాయి కలిగి ఉన్న 10మంది విద్యార్థులను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సుప్రజ తెలిపారు. దీనికి సంబంధిన వివవరాలను మీడియాకు తెలియజేశారు.. గుంటూరు సిటీలో చెడు వ్యసనాలకు బానిసలుగా మారి యువకులు, తల్లిదండ్రులను బెదిరించి, డబ్బులు తీసుకుని వెళ్లి, గంజాయి, యండియం వంటి మత్తు పదార్థాలను కొని సేవిస్తూ జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఏఎస్పీ చెప్పారు…పట్టాభిపురం సీఐ రాజశేఖర్ రెడ్డికి వచ్చిన సమాచారంతో ఇవాళ(బుధవారం) టీం వర్క్ చేసి వివిధ ప్రాంతాల్లో గంజాయి తాగుతున్న గ్యాంగ్‌ని అరెస్టు చేశామన్నారు. అరెస్టు అయిన 10మంది వ్యక్తులలో 9మంది స్టూడెంట్స్ ఉన్నారని తెలిపారు. వారినుంచి 2 గ్రాముల గంజాయి, యండియం పొట్లాలు, లిక్విడ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అరెస్ట్ చేసిన గంజాయి ముఠాలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలున్నారని తెలిపారు…