నిన్న మొన్న ఒకాయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటే భయపడిపోయి ఏకంగా మంత్రి..టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నారని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకోసమే నిన్న మొన్న ఒకాయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటే భయపడిపోయి ఏకంగా మంత్రి పదవే ఇచ్చారన్నారు. నాలుగేళ్లుగా కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వని సీఎం ఇప్పుడు అతని కడుపులో తలపెట్టిమరి మంత్రి పదవి ఇచ్చాడన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల జెండాకు ఉన్న పవర్ అన్నారు. ఇలా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వడంపై రేవంత్ రెడ్డి స్పందించారు..బహిరంగంగానే తిట్టుకున్నోళ్లు ఇప్పుడు పదవులు పంచుకుంటున్నారంటూ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి వాళ్లకు మంత్రి పదవులు వచ్చాయి… దీంతో తాండూరుకు ఒరిగిందేంటి? అని ప్రశ్నించారు. తాండూరుకు సాగునీరు ఇవ్వని వారిని బండకేసి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదట తాండూరుకు సాగునీరు వస్తాయని రేవంత్ హామీ ఇచ్చారు.

తాండూరు గడ్డ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట… దీన్ని ఇక్కడి కార్యకర్తలు మరోసారి నిరూపించారన్నారు. కాంగ్రెస్ జెండా కింద గెలిచి కొంతమంది విశ్వాసం లేకుండా అమ్ముడుపోయారు… దీంతో ఇంతకాలం కాంగ్రెస్ జెండాను కార్యకర్తలే కాపాడారన్నారు. ఏమిచ్చినా కాంగ్రెస్ కార్యకర్తల రుణం తీర్చుకోలేమన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని… జెండామోసిన కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటామని రేవంత్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఏ దందాలు చూసినా బీఆర్ఎస్ నేతలవే వున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. వీరి దోపిడీ కోసమేనా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది? అంటూ ఆందోళన వ్యక్తం చేసారు. పేదోళ్ల బతుకులు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని… అందుకోసం కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ మిత్తికే సరిపోయిందని… మళ్లీ అసలు అలాగే రైతులకు భారంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో పేదోడికి వంద గజాలు కొనే శక్తి లేకుండాపోయింది… బిఆర్ఎస్ నాయకులు మాత్రం రాష్ట్ర ప్రజల సంపద పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని… అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల వరకు రుణాలు మాపీ చేస్తామని రేవంత్ ప్రకటించారు.