అండర్‌-19 ప్రపంచకప్‌ ప్లేట్‌ లీగ్‌లో భూకంపం..

అండర్‌-19 ప్రపంచకప్‌ ప్లేట్‌ లీగ్‌లో భాగంగా ఐర్లాండ్‌, జింబాబ్వే మధ్య తాజాగా మ్యాచ్‌ జరుగుతుండగా భూకంపం సంభవించింది…జింబాబ్వే ఆరో ఓవర్‌ నడుస్తుండగా ఉన్నట్లుండి మైదానంలోని కెమెరాలు వణికాయి. కామెంటరీ బాక్సు కుదుపులకు లోనైంది. ఆ ప్రభావం సుమారు 20 సెకన్ల వరకూ కనిపించింది. కానీ మ్యాచ్‌కు మాత్రం ఎలాంటి అంతరాయం కలగలేదు..రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ సముద్ర తీరంలో ఏర్పడ్డ ఈ భూకంపం మ్యాచ్‌ జరుగుతున్న క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లోనూ స్వల్ప ప్రకంపనలకు కారణమైంది. ”భూకంపం వచ్చింది. మా వెనకాల రైలు వెళ్తున్న దానికంటే ఎక్కువ ప్రకంపనలే వచ్చాయి. మైదానంలోని మీడియా సెంటర్‌ వణికింది” అని ఆ సమయంలో కామెంటరీ బాక్సులో ఉన్న ఆండ్రూ పేర్కొన్నాడు.