యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకస్మిక భారత పర్యటన తర్వాత ఈ సంఘటన జరిగింది..ఇది జియోపాలిటిక్స్‌లో భాగంగా చోటు చేసుకున్నట్లు అంతర్జాతీయ అంశాల నిపుణులు చెబుతున్నారు. ఇస్లామాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించాలనే తన ప్రణాళికను యూఏఈ రద్దు చేసుకుంది. ఆగస్టు 2025 నుంచి రెండు దేశాల మధ్య చర్చల్లో ఉన్న అంశం నుంచి యూఏఈ వెనక్కి తగ్గింది..ఈ ప్రాజెక్టుపై ఆసక్తి తగ్గిందని, స్థానిక భాగస్వామిని ఎంపిక చచేయడంలో విఫలమైందని పేర్కొంటూ యూఏఈ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు పాకిస్తాన్ పత్రిక ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదికింది. అధికారికంగా కారణాలు ప్రస్తావించకపోయినా, ఈ పరిణామాన్ని చూస్తే ఇందుకు భారత్-యూఏఈ మధ్య బలపడుతున్న బంధమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదే సమయంలో గల్ఫ్ పరిణామాలు కూడా కారణమవుతున్నాయి. యెమెన్‌లో అధికారం కోసం సౌదీ అరేబియా, యూఏఈ రెండు కూటములకు మద్దతు ఇస్తున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఒకింత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మరోవైపు, సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. టర్కీ కూడా ఈ ఒప్పందంలో భాగం కావాలని ఆకాంక్షిస్తుంది. ఇస్లామిక్ నాటో కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో ఉంది. దీంతో యూఏఈ-భారత్ మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది…
మోడీతో భేటీ ఎఫెక్ట్?
ఇటీవల యూఏఈ అధ్యక్షుడు షేక్ నహ్యాన్ భారత్‌లో పర్యటించారు. ఢిల్లీలో ఆకస్మికంగా మూడు గంటల పాటు గడిపారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీతో రక్షణ ఒప్పందాలపై కీలక చర్చలు జరిపారు. అయితే చర్చలు జరిపిన కొద్ది రోజులకే పాక్‌తో ఎయిర్పోర్ట్ డీల్ రద్దు కావడం గమనార్హం. ఎయిర్పోర్ట్ నిర్వహణ కోసం తగిన స్థానిక భాగస్వామి (Local Partner) దొరకలేదని యూఏఈ అధికారికంగా చెబుతున్నప్పటికీ, దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక పేర్కొంది. ఒకవైపు పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీలతో కలిసి ‘ఇస్లామిక్ నాటో’ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండగా.. యూఏఈ మాత్రం భారత్‌తో రక్షణ బంధాన్ని (Strategic Defence Partnership) బలోపేతం చేసుకుంటోంది. సౌదీ-యూఏఈ మధ్య పెరుగుతున్న అంతరం కూడా పాక్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలో వైఫల్యాలు, భద్రతా కారణాల దృష్ట్యా యూఏఈ అక్కడి పెట్టుబడులపై నమ్మకం కోల్పోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి, ఆఫ్ఘనిస్తాన్ వంటి క్లిష్టమైన ప్రాంతాల్లోనూ విమానాశ్రయాలను నిర్వహించిన అనుభవం ఉన్న యూఏఈ.. పాకిస్తాన్ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం ఆ దేశ ఆర్థిక, దౌత్యపరమైన వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది…