28 ఏండ్లు దాటితే నో హాస్టల్‌.. ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం..!?

ఉస్మానియా యూనివర్సిటీ, :

శతాధిక వసంతాల ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ప్రతిష్ట అధికారుల అసమంజస నిర్ణయాలతో మసకబారుతున్నది. వందేమాతరం ఉద్యమం మొదలుకుని ఎన్నో సామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలకు వేదికగా నిలిచిన ఓయూను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. 28 ఏండ్ల వయసు దాటిన పీజీ విద్యార్థులకు హాస్టల్‌లో అడ్మిషన్లు నిరాకరిస్తుండటమే ఇందుకు తాజా నిదర్శనం. ఈ తుగ్లక్‌ నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం కాకమ్మ కబుర్లు చెబుతూ దాటవేస్తున్నారు. దీనిపై విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి..

వర్సిటీలో అడ్మిషన్‌ పొందిన వారికి వయోపరిమితి సరికాదు
ఓయూలో ప్రవేశం పొందిన విద్యార్థులకు హాస్టల్‌ ప్రవేశాల విషయంలో వయోపరిమితి విధించడాన్ని ఖండిస్తు న్నాం. ఈ పరిమితి వల్ల సుదూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉన్నది. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి.

– కొమ్ము శేఖర్‌, ఎంఎస్‌ఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి

హాస్టల్‌ ప్రవేశానికి నిబంధనలు తొలగించాలి
ఓయూ హాస్టల్‌లో ప్రవేశానికి విధించిన వయోపరిమితి నిబంధన వెంటనే తొలగించాలి. సీపీజీఈటీలో అర్హత సాధించిన విద్యార్థులకు హాస్టల్‌ వసతి కల్పించాలి. కష్టపడి చదివి వర్సిటీలో సీటు సంపాదిస్తే, ఇక్కడికి వచ్చేసరికి వయోపరిమితి నిబంధన తీసుకురావడం సరికాదు.

– కొమ్మనబోయిన సైదులు యాదవ్‌, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్‌

పేదలకు ఉన్నత విద్యను దూరం చేయడమే
కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఉన్నత విద్య ను దూరం చేసే కుట్ర లో భాగంగానే ఓయూ అధికారులు ఈ నిర్ణ యం తీసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, యూజీసీ నిబంధనలకు వ్యతిరేకం. రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులను హరించడమే.

– చటారి దశరథ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీఆర్‌ఎస్వీ