తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఏపీపై ప్రభావం చూపుతోంది. తుఫాన్ ప్రభావంతో అన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలో పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బాధితుడికి వెయ్యి రూపాయిల చొప్పున ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. కుటుంబంలో ముగ్గురు కన్నా ఎక్కువ ఉంటే గరిష్ఠంగా రూ.3 వేలు సాయం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది..బాధితులు పునరావాస కేంద్రం నుంచి తమ సొంత ఇళ్లకు వెళ్లే ముందు ఈ ఆర్థిక సాయం అందించాలని సూచించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉండగా ప్రస్తుతం ఖమ్మంలో మొంథా తుపాన్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. అక్కడ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ..
మరోవైపు మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి…
హైదరాబాద్ – శ్రీశైలం రహదారి పై బ్రిడ్జిపై వరద ఉద్ధృతి..
నాగర్ కర్నూల్ జిల్లా: అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి హైదరాబాద్ – శ్రీశైలం రహదారి పై బ్రిడ్జిపై వరద ఉద్ధృతి..బప్రమాదకర స్థాయిలో హై లెవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వరద.. నిలిచిన రాకపోకలు..
హుస్సేన్ సాగర్‌కు భారీ వరద నీరు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్‌కు వరద పెరిగింది. సాగర్ FTLకు చేరువలో వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు. ప్రస్తుత నీటిమట్టం 513.40 మీటర్లు. ఇన్ ఫ్లో 2000 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 250 క్యూసెక్కులు వస్తోంది. అధికారులు హుస్సేన్ సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కవాడిగూడ, అశోక్ నగర్, గాంధీనగర్, సబర్మతి నగర్.. అరవింద్ నగర్ కాలనీలలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగాహైదరాబాద్ జంట జలాశయాలు నిండు కుండలా తలపిస్తున్నాయి..
బాధితులకు నిత్యవసరసరకుల పంపిణీ..
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం నిర్దేశించిన విధంగా అధికార యంత్రాంగం నిత్యావసరాలను సమకూర్చింది. బియ్యం 25 కేజీలు (మత్స్యకారులకు, చేనేత కార్మికులకు 50 కేజీలు), కందిపప్పు కేజీ, పామాయిల్ ఒక లీటర్, ఉల్లిపాయలు కేజీ, బంగాళాదుంపలు కేజీ, పంచదార కేజీ చొప్పున అందిస్తారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఆదేశాలను అనుసరించి ఆ శాఖ అధికార యంత్రాంగం అన్ని రేషన్ షాపులకు వీటిని చేర్చింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 14,415 రేషన్ షాపుల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3424 మెట్రిక్ టన్నుల పంచదారతోపాటు ఇతర నిత్యావసరాలను పంపిణీకి సిద్ధంగా ఉంచారు. నిత్యావసరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి నిత్యావసరాల పంపిణీని సమన్వయం చేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఎడతెరిపి లేకుండా వర్షాలు కుమ్మేస్తున్నాయి.
వర్షాల కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరాబాద్ సిటీలో గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అంబర్‌పేట, కాచిగూడ, బర్కత్‌పురా, మీర్పేట్, బాలాపూర్, తుక్కుగూడ, పహాడీషరీఫ్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, దోమలగూడ, మెహిదీపట్న ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులపైకి వరద నీరు చేరింది. ఈ క్రమంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది…
తెలంగాణలో భారీ వర్షాలు.. రైల్వే ట్రాక్‌పై నీరు, నిలిచిపోయిన రైళ్లు
మొంథా తుపాను క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతోంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ భూభాగంపై కొనసాగుతోంది. దీని కారణంగా ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంట 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మొంథా క్రమంగా బలహీనపడుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది..
హైదరాబాద్‌తో కుమ్మేస్తున్న వానలు.. ట్రాఫిక్ జామ్
అర్థరాత్రి నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. దీని కారణంగా రోడ్లపై వరద నీరు వచ్చి చేరింది. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. లక్డికాపూల్, అయోధ్య జంక్షన్, పిటిఐ, మహావీర్ హాస్పిటల్, మసాబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్, ఎన్ఎండిసి, ఎస్డి హాస్పిటల్, అజీజియా మసీదు, మెహదీపట్నం వైపు రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి.
హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, భూపాలపల్లి, సూర్యాపేట, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. వీటిలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఇంకా మరికొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు..
నల్గొండ జిల్లా..నకిరేకల్..
మూసి ప్రాజెక్ట్ అప్డేట్..
“మోంథా తుపాన్ ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా కనిపిస్తోంది.ఎగువన కురుస్తున్న నిరంతర వర్షాలతో మూసి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్‌కి 2,677.06 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2,368.15 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 644.60 అడుగుల వద్ద ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు సమీపంగా, ప్రస్తుతం 4.36 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.అధికారులు జాగ్రత్త చర్యలలో భాగంగా నాలుగు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీని వలన మూసి నది ఒడ్డు గ్రామాలకు వరద నీరు చేరే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. వర్షపాతం ఇంకా కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.