విప్లవ నేత జలగం జనార్ధన్ కు నివాళులు అర్పించిన సిపిఐ యమ్ యల్ న్యూ డెమోక్రసీ.!

వెలిదండ విప్లవ నేత జలగం జనార్ధన్ కు జోహార్లు.

వెలిదండ గ్రామంలో సిపిఐ యమ్ యల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ జలగం జనార్ధన్ (జన్నుసార్) 5 వ, వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ గ్రామ కార్యదర్శి మేకల కనకారావు పాల్గొని మాట్లాడుతూ అణగారిన వర్గాల పక్షాన పోరాడిన విప్లవకారుడు కామ్రేడ్ జలగం జనార్ధన్ అని తెలియజేశారు. దోపిడీ, పీడన,అణిచివేత, అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటిత పరిచాడని, గ్రామాలలో భూస్వాముల ఆగడాలు అరికట్టేందుకు పెత్తందారుల దౌర్జన్యాలకు గోరి కట్టేందుకు దండుగట్టి సాగిన సమర నేత అని గుర్తు చేశారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఏనాడూ వెనకడుగు వేయకుండా ఉద్యమ బాటలో కొనసాగాడని, పార్టీ క్యాడర్ కు భరోసా అందిస్తూ నమ్మిన సిద్ధాంతం వెలుగులో తుది వరకు పయనించిన ప్రజా పోరు కెరటం అని అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశభక్తిని మాటల్లో వల్లిస్తూ అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచి ప్రజలను దగా చేస్తుందని దేశ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిపోయిందని రాష్ట్రంలో రైతాంగం పండించిన ధాన్యం కొనే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కామ్రేడ్ జలగం జనార్దన్ లాంటి అమరులు అందించిన స్ఫూర్తితో పోరాడాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చనగాని సాంబయ్య, నారాయణ, గండు నాగేష్, చనగాని లక్ష్మయ్య, గండు మల్లయ్య, పర్వతాలు, కామల్ల శ్రీను, వల్లపు దాసు లచ్చయ్య, జిలకర ముత్తయ్య, వల్లపు దాస్ ఎంకటి, పోటు శ్రీహరి, సువార్త, సంతోష, చిన్న లక్ష్మీ, పెద్ద లక్ష్మి, మంగమ్మ ,నాగేంద్ర, మల్లమ్మ,నాగయ్య తదితరులు పాల్గొన్నారు.