అంగరంగవైభవంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు..

యాదాద్రి భువనగిరి జిల్లా:

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.

కొండపైన ప్రధానాలయ పునర్నిర్మాణం అనంతరం నాలుగోసారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా….

బుధవారం నాడు రాత్రి ఆలయ మాడ వీధిలోని ప్రత్యేక కళ్యాణ మండపంలో స్వామిఅమ్మవార్ల తిరు కల్యాణ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది.

స్వామివారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరు కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

కల్యాణములో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు.

స్వామివారి కళ్యాణముకు భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.

కల్యాణ మండపంలో స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేసి కల్యాణ ఘట్టాన్ని ఆరంభించారు అర్చకులు.

వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణాలు, మంగళవాయిద్యాల కరతాళ ధ్వనుల మధ్య ముళ్లోకాది దేవతలు చూస్తుండగా నరసింహస్వామివారు లక్ష్మీఅమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు.

ఆ సమయంలో ఆలయ ప్రాంగణం “నమో నారసింహ, జై నారసింహ, గోవిందా” నామస్మరణతో మార్మోగింది.స్థానిక ప్రజాప్రతినిధులు,పలువురు వీఐపీలు స్వామివారి వైభవ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

స్వామిఅమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తూ ఆనందపరవశులైనారు.

సమస్త దేవతలు, మహర్షులు, ప్రకృతిలోని ప్రాణకోటి మొత్తం ఈ కల్యాణ వేడుకను తనివితీరా వీక్షించి పరవశించారని వేదపండితులు భక్తులకు ప్రవచించారు.

లోక కల్యాణం, జగత్ రక్షణ కోసం స్వామివారు లక్ష్మీదేవి మెడలో మంగళసూత్రధారణ గావించారని, స్వామివారి కరుణాకటాక్షములు అమ్మవారితో పాటు సమస్త లోకాలు సంతరిస్తాయని అర్చకులు వివరించారు.