1.8°C దాటితే పెను ప్రమాదమే.భూమి భవిష్యత్తుపై ఐరాస హెచ్చరిక..!.

భూమి భవిష్యత్తుపై ఐరాస హెచ్చరిక.. 1.8°C దాటితే పెను ప్రమాదమే!

భూగోళంలో ఉష్ణోగ్రతలు ఊహకందని వేగంతో పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు.
ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన తీవ్రమైన వేడి, ఉక్కపోత, అడవుల్లో భయానక కార్చిచ్చులు, ఆకస్మిక వరదలు.. భవిష్యత్తులో భూమి మరింత వేడెక్కితే పరిస్థితులు ఎలా ఉంటాయో చూపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5°C దాటడం అంటే ప్రపంచం అంతం కాదని, అయితే ఉష్ణోగ్రత ప్రతి అర డిగ్రీ పెరిగేకొద్దీ మానవాళిపై తీవ్ర ప్రభావం పడుతుందని గుటెర్రెస్ పేర్కొన్నారు.
అయితే ఉష్ణోగ్రతలు 1.8°Cకు చేరితే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. తీవ్ర తుపానులు, భారీ వర్షాలు, కరువులు పెరగడంతో పాటు ఆహారం, తాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
మంచు కొండలు వేగంగా కరిగి సముద్ర మట్టాలు పెరిగితే తీర ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది ప్రజలు ఇళ్లు కోల్పోయి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. అంతేకాదు.. ప్రపంచంలోని కీలకమైన అమెజాన్ అడవులు దెబ్బతినడం, సముద్ర ప్రవాహాల్లో భారీ మార్పులు వంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
భూమిని కాపాడుకోవాలంటే ఇప్పుడే చర్యలు తీసుకోవాలి.. లేకపోతే భవిష్యత్ తరాలకు తిరిగి సరిచేయలేని నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందని ఐరాస హెచ్చరిస్తోంది.