ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్‌కు కేసీఆర్..

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్‌కు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం సందర్భంగా కృష్ణా, గోదావరి జలాల విషయంలో, తెలంగాణ రాష్ట్రానికి, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చించనున్నారు…దానితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణా జలాలను కొల్లగొడుతున్నా కూడా దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని భావించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చ జరగనున్నది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలు అని కేంద్రం ముందు దేబరించడం బాధాకరం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమే.

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ ప్రజలు, రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదు. ఇంకా చెప్పాలంటే బీజేపీ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదనేది స్పష్టమవుతున్నది. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కానీ, కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జల దోపిడికి సహకరిస్తున్న కేంద్ర బీజేపీ విధానాన్ని గాని ఎదుర్కోవాలంటే.. తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు..