50కి పైగా సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి భారతీయ క్రికెటర్‌గా వైభవ్ రికార్డ్..!

ఐపీఎల్ 2026లో సరికొత్త చరిత్ర క్రియేట్ అయింది. రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుకు ఆడుతున్న కేవలం 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ లీగ్ చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాని ఒక అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు..మంగళవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జాయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే ఒకే ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా 50కి పైగా సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి భారతీయ క్రికెటర్‌గా వైభవ్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఏ భారతీయ దిగ్గజ బ్యాటర్‌కు కూడా ఒకే సీజన్‌లో 50 సిక్సులు కొట్టడం సాధ్యం కాలేదు.

లక్నోపై జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు, 10 సిక్సర్లతో విరుచుకుపడి 93 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో కలిపి ఈ సీజన్‌లో వైభవ్ మొత్తం 13 మ్యాచ్‌ల్లో ఏకంగా 53 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఒకే సీజన్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన మూడో బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు. ఇంతకుముందు వెస్టిండీస్ పవర్ హిట్టర్లు క్రిస్ గేల్ (2012, 2013 లో), ఆండ్రూ రస్సెల్ (2019లో) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఒక 15 ఏళ్ల భారతీయ కుర్రాడు వీరి సరసన చేరడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

ఐపీఎల్ ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇప్పటికీ వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఆయన 2012 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ ఏకంగా 59 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ 53 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టడానికి వైభవ్‌కు ఇంకా కేవలం 6 సిక్సర్లు మాత్రమే అవసరం. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోయినా.. లీగ్ దశలో కనీసం ఒక మ్యాచ్ మిగిలి ఉంది కాబట్టి, వైభవ్ ఈ రికార్డును ఈజీగా దాటేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు..