సినీ హీరో అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఉదయం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు వెనుక గేటు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఎస్కార్ట్ వాహనం ద్వారా గీతాఆర్ట్స్ కార్యాలయంకు వెళ్లారు. అక్కడ సుమారు 45 నిమిషాల పాటు న్యాయవాది నిరంజన్ రెడ్డితో చర్చించారు. బెయిల్ వచ్చినా జైలు నుంచి విడుదల ఆలస్యంపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి జూబ్లిహిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు. జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ కు కుటుంబ సభ్యులు దిష్టితీసి స్వాగతం పలికారు. సతీమణి స్నేహారెడ్డి, ఆయన పిల్లలు అల్లు అర్జున్ ను హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు.నేను బాగానే ఉన్నాను.. అభిమానులు ఆందోళన చెందొద్దు. నాకు అండగా నిలిచిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నేను చట్టాన్ని గౌరవిస్తా. చట్టానికి కట్టుబడి ఉంటా. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. ఆ కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నా. వారికి అండగా ఉంటాను. నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. 20ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తున్నా.. నా సినిమాలే కాదు.. మావయ్య సినిమాలూ చూశా. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరం.’’ అని అల్లూ అర్జున్ అన్నారు…
తాను చట్టాన్ని గౌరవిస్తానని, దానికి కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ అన్నారు. కేసు కోర్టులో ఉన్నందున దాని గురించి మాట్లాడనని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇవాళ ఉదయం చంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ జూబ్లీహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని తెలిపారు. ఆ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అన్నారు.
గత 20 ఏళ్లుగా థియేటర్కు వెళ్లి సినిమాలు చూస్తున్నానని అల్లు అర్జున్ చెప్పారు. తన సినిమాలే కాదని తన మామయ్యల సినిమాలూ చూశానని తెలిపారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని అన్నారు. బాధితురాలు రేవతి కుటుంబానికి బాసటగా ఉంటానని స్పష్టం చేశారు. తనకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికి, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను న్యాయాన్ని నమ్ముతున్నానని ఉద్ఘాటించారు. తాను బాగున్నానని.. ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.
అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతోన్న సినీ ప్రముఖులు..!
చిరంజీవి సతీమణి సురేఖ, కె. రాఘవేంద్రరావు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ సోదరులు, దర్శకుడు సుకుమార్, పుష్ప నిర్మాతలు నవీన్ మరియు రవిశంకర్, కొరటాల శివ, దిల్ రాజు, నాగవంశీ వంటి వారంతా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. తనకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన సినీ ప్రముఖులను అల్లు అర్జున్ కూర్చోబెట్టి కాసేపు ముచ్చటించారు. ఇంకా సినీ ప్రముఖులు బన్నీ ఇంటికి క్యూ కడుతూనే ఉన్నారు.