25 ఏళ్ల తర్వాత బయటపడిన సంగమేశ్వర ఆలయం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని చారిత్రక సంగమేశ్వర ఆలయం నీటిమట్టం తగ్గడంతో మళ్లీ దర్శనమిచ్చింది. 25 ఏళ్ల తర్వాత వర్షాకాలంలో ఆలయం బయటపడటం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు..
నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool District) కొల్లాపూర్ మండలంలోని సోమశిల సమీపంలో ఉన్న చారిత్రక సంగమేశ్వరాలయం కృష్ణా నదిలో నీటి మట్టం తగ్గడంతో బయటపడింది. ప్రతి ఏటా వేసవిలో మాత్రమే ఈ ఆలయం బయట పడుతుంది. కానీ ఈ సారి ముందుగానే తేలడం గమనార్హం.
కృష్ణానదిలో గల సంగమేశ్వర ఆలయం ప్రతి యేటా వానాకాలంలో మునిగి పోతుంది. అనంతరం వేసవిలో నీటి మట్టం తగ్గిన తర్వాత బయట పడుతుంది. అయితే ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఎక్కువగా పడలేదు. కృష్ణానదికి వరదలు వచ్చినా.. శ్రీశైలం నిండలేదు. అయితే భారీగా వరద రావడంతో సంగమేశ్వర ఆలయం మునిగిపోయింది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కాలువలు, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేస్తుండటంతో నీటి మట్టం వేగంగా పడిపోతుంది. దీంతో తాజాగా సంగమేశ్వర ఆలయ గోపురం బయట పడింది.
Sangameshwara Temple | 8 నెలలు నీటిలోనే..
సాధారణంగా వేసవి కాలంలో మాత్రమే కనిపించే ఈ ఆలయం, ఈ ఏడాది ముందుగానే నీటి పైకి తేలింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇలా జరగడం విశేషమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయం ప్రతి ఏటా ఏడాదిలో సుమారు 8 నెలల పాటు కృష్ణా నది నీటిలో మునిగి ఉండి, దాదాపు 4 నెలల పాటు నీటి మట్టానికి పైన ఉంటుంది. ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్ట్లో నీటి నిల్వలు తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.