దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ‘సేవ్ డెమోక్రసీ’ (Save Democracy) నినాదంతో హైదరాబాద్లో ఇండియా (INDIA) కూటమి చేపట్టిన ఆందోళనా కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కూటమి నేతలు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇండియా కూటమి నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, వామపక్ష నేతలు కలిసి నెక్లెస్ రోడ్ మీదుగా లోకభవన్ వైపు ర్యాలీగా బయలుదేరారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా, “ప్రజాస్వామ్యాన్ని కాపాడండి” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ లోక్భవన్కు చేరుకోకుండా నెక్లెస్ రోడ్లోనే పోలీసులు భారీగా ముళ్లకంపలు, బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. నిరసనకారులు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర నెట్టివేత, ఉద్రిక్త వాతావరణం నెలకొంది..
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. భారీ ఎత్తున కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు తరలి వచ్చాయి. నిరసన ప్రదర్శన ప్రారంభమైన కొద్దిసేపటికే పోలీసులు జోక్యం చేసుకొని ర్యాలీని అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న మంత్రులు, పలువురు నేతలను అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు…