ఆఫ్ఘానిస్థాన్‌లో భూకంపం.. భారత్ లో పలు ప్రాంతాల్లో అలజడి.

ఆఫ్ఘానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.14 గంటల సమయంలో రిక్టర్‌ స్కేలుపై 5.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలు భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌, ఢిల్లీ, పంజాబ్‌ ప్రాంతాలతో పాటు పాకిస్థాన్‌, తజికిస్థాన్‌లోనూ నమోదైనట్లు సమాచారం. భూకంప కేంద్రం ఆఫ్ఘానిస్థాన్‌లో ఉన్నట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది.

భూమికి 130 కిలోమీటర్ల లోతులో కేంద్రం..

భూకంప కేంద్రం 36.157 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 71.240 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూమికి సుమారు 129–130 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. ప్రకంపనలు అనుభూతి చెందిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమయ్యారు..

ఈ భూకంప తీవ్రత వల్ల భారత్‌లోని జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాలతో పాటు పొరుగు దేశాలైన పాకిస్థాన్, తజికిస్థాన్‌లలో కూడా బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ మరియు జమ్మూ కశ్మీర్ పరిసర ప్రాంతాలలో ఇళ్లు, ఆఫీసుల్లోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.