తీరంవైపు ‘అర్ణబ్‌’ తుఫాను..!

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్ణాబ్’ తుపాను అత్యంత వేగంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాను కదలికలను ఇస్రో శాటిలైట్లు స్పష్టంగా చిత్రీకరించాయి. తుపాను తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు రెడ్-లెవెల్ తుపాను హెచ్చరికను జారీ చేసింది. దీంతో తీర ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది.

వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, ఈ తుపాను సోమవారం (అక్టోబర్ 26) అర్ధరాత్రి నాటికి తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం మరింత బలపడి, అక్టోబర్ 27 నాటికి అతి తీవ్ర తుపానుగా పరిణామం చెందే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇస్రో పంపిన ఉపగ్రహ చిత్రాలలో దట్టమైన మేఘాలు, స్పష్టమైన కేంద్రకంతో ఈ తుపాను వ్యవస్థీకృతంగా బలపడుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ తుపాను తూర్పు-మధ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది విశాఖపట్నానికి ఆగ్నేయంగా సుమారు 650 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తొలుత పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి, ఆ తర్వాత వాయువ్య దిశగా తిరిగి ఏపీ తీరం వైపు ప్రయాణిస్తుందని తెలిపారు.

అక్టోబర్ 28వ తేదీ ఉదయం సమయంలో ఈ తుపాను బాపట్ల, విశాఖపట్నం మధ్య, యానాంకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను తీరం దాటే సమయంలో గాలి వేగం గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని, కొన్ని సమయాల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు అన్ని రకాల సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ బలపడి తుఫానుగా మారింది. అక్టోబర్‌ 26 అర్ధరాత్రికి తీవ్ర తుఫానుగా, 27వ తేదీ నాటికి అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ 28వ తేదీ ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటవచ్చని తెలిపింది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..

ఒడిశాలోనూ అప్రమత్తత

తుఫాను ప్రభావంతో దక్షిణ ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్‌ 27, 28 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చని ఐఎండీ హెచ్చరించింది. అక్టోబర్‌ 29న కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్థానిక అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.