తీవ్ర తుఫాన్ గా దూసుకొస్తున్న ‘ మురుసు’ …!

అర్నబ్’ తుఫాన్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో తీవ్ర తుఫాన్ ‘మురుసు’ దూసుకొస్తోంది…

బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ తీవ్రంగా బలపడటంతో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మురుసు తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

తెలంగాణలోనూ మురుసు తుఫాన్ ప్రభావం కనిపించనుంది. సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, జనగామ, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు అవకాశాలు ఉన్నాయి. హనుమకొండ, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు…పంటలు కోతకు వచ్చిన సమయంలో వరుస తుఫాన్లు, భారీ వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే అర్నబ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు.. ఇప్పుడు మురుసు తుఫాన్ ప్రభావంతో మరింత నష్టం వాటిల్లుతుందేమోనని భయపడుతున్నారు. పొలాల్లో పంటలు నేలకొరిగితే, కోతకు వచ్చిన ధాన్యం తడిసిపోతే తీవ్ర ఆర్థిక నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

మురుసు తుఫాన్ ప్రస్తుతం గంటకు సుమారు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం కావలికి సుమారు 220 కిలోమీటర్లు, నెల్లూరుకు 210 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ ఉంది. తుఫాన్ ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది…

ఆంధ్రలో భారీ వర్షాలు..

రాత్రి నుంచి నెల్లూరు, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
తుఫాను ప్రభావంతో కృష్ణా, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచే వర్షం పడుతోంది. దీంతో నగర వీధులు జలమయమయ్యాయి. తునిలో సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లాలో చిరుజల్లులు పడుతున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం, అంబాజీపేట ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి..శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట, జి.సిగడాం, సారవకోట, జలుమూరు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌, తాగునీరు, వైద్యసేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, విజయనగరం జిల్లా చీపురుపల్లి, వేపాడ మండలాల్లో వర్షం కురిసింది.

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మురసు తుఫాను దృష్ట్యా పలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ముందస్తు చర్యగా నేడు విశాఖపట్నం (భోగాపురం) ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌ వెళ్లాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశారు. వాతావరణం అనుకూలించే వరకు ప్రయాణికులు ఎయిర్‌లైన్‌ స్టేటస్‌చెక్‌ చేసుకోవలని విమానాశ్రయ అధికారులు సూచించారు..