సోమాలియా తీరంలో సముద్రపు దొంగలు … తీరంలో సముద్రపు దొంగల చెర నుంచి 20 మందిని రక్షించిన భారత నౌకాదళం..!
సోమాలియా తీరంలో సముద్రపు దొంగల చేతికి చిక్కిన ఇరాన్‌కు చెందిన ఫిషింగ్ బోటును భారత నౌకాదళం విజయవంతంగా స్వాధీనం చేసుకుంది. దాదాపు 48 గంటల పాటు సాగిన ప్రత్యేక ఆపరేషన్‌లో బోటులో ఉన్న 20 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించింది. ఈ సాహసోపేత చర్యలో భారత నౌకాదళంతో పాటు వాయుసేన సిబ్బంది కూడా కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్ విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైనిక బలగాలను ప్రత్యేకంగా అభినందించారు.
అధికారుల వివరాల ప్రకారం, అక్టోబర్ 29న సోమాలియా ఈశాన్య తీరంలోని బందర్ బైలా, హఫున్ పట్టణాల మధ్య సాయుధ సముద్రపు దొంగలు ఇరాన్‌కు చెందిన ‘అజినీ’ ఫిషింగ్ బోటును హైజాక్ చేశారు. ఆ సమయంలో బోటులో 20 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనతో అరేబియా సముద్రంలో సముద్ర భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని భారత అధికారులు భావించారు. సముద్రపు దొంగలు ఈ బోటును ఇతర వాణిజ్య నౌకలపై దాడులు చేసేందుకు ఉపయోగించే ప్రమాదం ఉందని అంచనా వేశారు.
సమాచారం అందుకున్న వెంటనే భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ‘ఐఎన్‌ఎస్ కోల్‌కతా’ యుద్ధనౌక ఆధ్వర్యంలో రక్షణ చర్యలు ప్రారంభించింది. పీ-8ఐ నిఘా విమానాలు, ఎంక్యూ-9 డ్రోన్ల సాయంతో హైజాక్‌కు గురైన బోటు కదలికలను గుర్తించి దాని చుట్టూ నిఘా ఏర్పాటు చేశారు. దుండగులు మరో నౌకపై దాడి చేయకుండా అడ్డుకోవడంతో పాటు బోటుపై తిరిగి నియంత్రణ సాధించేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేశారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత వాయుసేనకు చెందిన సి-17 విమానం ద్వారా నౌకాదళానికి చెందిన మెరైన్ కమాండోలను సముద్ర ప్రాంతంలోకి దించారు. అత్యంత సమన్వయంతో ముందుకు సాగిన కమాండోలు ఫిషింగ్ బోటును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం అందులో ఉన్న 20 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు 48 గంటల పాటు సాగిన ఈ చర్య ముంబయి తీరానికి దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరంలో జరిగినట్లు సమాచారం.
ఆపరేషన్ విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. భారత నౌకాదళం, వాయుసేన సిబ్బంది పక్కా ప్రణాళికతో, అద్భుతమైన సమన్వయంతో ఈ చర్యను పూర్తి చేశారని ప్రశంసించారు. అత్యాధునిక ఆయుధాలతో ఉన్న సముద్రపు దొంగల నుంచి బోటును, అందులోని సిబ్బందిని రక్షించడం భారత సాయుధ బలగాల సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. సముద్రంలో ఎదురయ్యే ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని ఈ ఆపరేషన్ మరోసారి నిరూపించిందని తెలిపారు.