గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాలి..!

గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాలి

దేవరకొండ మైనింగ్ కార్యకలాపాలపై సమగ్ర సర్వేకు ఆదేశం

ఐదు రోజుల్లో ప్రాథమిక నివేదిక.. 15 రోజుల్లో శాఖల వారీగా సమగ్ర నివేదిక ఇవ్వాలి – జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోతు హుస్సేన్ నాయక్

దేవరకొండ……….
గిరిజన ప్రజలు తమ హక్కుల సాధన కోసం జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌ను ఆశ్రయించాలని కమిషన్ సభ్యుడు జాతోతు హుస్సేన్ నాయక్ పిలుపునిచ్చారు. ఎస్టీ కమిషన్ కోర్టు ప్రజల హక్కుల సాధనకు ఒక ఆయుధమని, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే డైరీ నంబర్ కేటాయించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గురువారం దేవరకొండ మండలంలోని వెంకట్ తండా, బొల్లిగుట్ట తండా, కాచారం ఘాజీ నగర్ గ్రామాల్లో ఆయన పర్యటించి గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా మైనింగ్ కార్యకలాపాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, రహదారులు, విద్యుత్, భూముల పట్టాల సమస్యలపై ప్రజలతో మాట్లాడారు.
మైనింగ్ కార్యకలాపాలపై మైనింగ్, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో సమగ్ర సర్వే నిర్వహించాలని ఆదేశించారు. మైనింగ్ ప్రభావాలపై ఐదు రోజుల్లో ప్రాథమిక నివేదిక, సంబంధిత శాఖలు 15 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. మైనింగ్ లీజుల రెన్యువల్ సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారా? స్థానికులకు ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా? అనే అంశాలపై వివరాలు కోరారు.
బొల్లిగుట్ట తండాలో అర్హులైన గిరిజనులకు భూముల పట్టాలు అందించాలని, వారం రోజుల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కాచారం గ్రామంలో మైనింగ్ సమస్యలపై 32 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులతో మాట్లాడి, వారికి ప్రభుత్వపరంగా రావాల్సిన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గిరిజనుల సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హుస్సేన్ నాయక్ స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఎన్‌సీఎస్టీ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాబు, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, ఆర్డీఓ వనజరాణి, డీఎంహెచ్‌ఓ రాహుల్, ఎంపీడీఓ పార్వతి, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.