అంతర్జాతీయంగా తీవ్రమవుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాల భయాలు, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తన బంగారు నిల్వలను విదేశాల నుండి స్వదేశానికి తరలించే వ్యూహాత్మక ప్రక్రియను మరింత వేగవంతం చేసింది…సెప్టెంబర్ 2026తో ముగిసిన ఆరు నెలల కాలంలోనే ఆర్బిఐ దాదాపు 60 టన్నుల బంగారాన్ని విదేశీ ఖజానాల నుండి అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ భారతదేశానికి తీసుకువచ్చింది. ఈ తాజా తరలింపుతో రిజర్వ్ బ్యాంక్ మొత్తం బంగారు నిల్వలలో స్వదేశంలో ఉన్న బంగారం వాటా ఏకంగా 84 శాతానికి చేరుకోవడం ఆర్థిక వర్గాలలో చర్చనీయాంశమైంది.
తాజా గణాంకాల ప్రకారం, ఆర్బిఐ వద్ద ప్రస్తుతం మొత్తం 880.5 టన్నుల బంగారు నిల్వలు ఉండగా.. ఇందులో 740.13 టన్నులు భారతదేశంలోనే నిల్వ ఉన్నాయి. మిగిలిన 140.4 టన్నుల బంగారం (మొత్తం నిల్వలలో సుమారు 16 శాతం) లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో ఉన్న బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కస్టోడియన్ల సంరక్షణలో ఉంది.
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో తక్షణ ఆర్థిక లావాదేవీలు జరపడానికి.. స్వాప్ ఒప్పందాలకు, విదేశీ మారక నిల్వల నిర్వహణలో సౌలభ్యం కోసం కొంత భాగాన్ని విదేశాలలో ఉంచడం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అనుసరించే సాధారణ విధానమే అని చెప్పుకోవచ్చు..
కానీ ప్రధాని మోదీ కోరినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గతంలో విదేశాల్లో నిల్వ ఉంచిన 60.08 టన్నుల బంగారాన్ని గత ఆరు నెలల వ్యవధిలోనే తిరిగి భారతదేశానికి తీసుకొని వచ్చింది. దీనితో దేశానికి చెందిన మొత్తం బంగారు నిల్వలలో సుమారు 84 శాతం ఇప్పుడు భారతదేశంలోనే ఉన్నాయి.
ప్రధాన మంత్రి ప్రజలను బంగారం కొనవద్దని కోరుతున్న తరుణంలో, RBI ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని ఎందుకు తిరిగి తీసుకువచ్చింది? ఇది ప్రభుత్వ వ్యూహంతో సంబంధం లేని స్వతంత్ర నిర్ణయమా? ఈ చర్య వెనుక ఒక ప్రధాన కారణం ఏంటో చూద్దాం.
ప్రధాని మోదీ ప్రజలను బంగారం కొనవద్దని ఎందుకు కోరారు?.
మే 10, 2026న హైదరాబాద్‌లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కనీసం ఒక సంవత్సరం పాటు అనవసరమైన బంగారం కొనుగోలు చేయవద్దని కోరారు. బంగారు దిగుమతుల కోసం భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతోందని, ప్రపంచ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని దేశం తన విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవడం చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు.
60 టన్నుల బంగారాన్ని ఎందుకు తిరిగి తీసుకువచ్చారు?.
బంగారం కొనుగోళ్లు పెరిగితే దిగుమతి బిల్లు కూడా పెరుగుతుంది, దీనివల్ల డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలపై ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే, RBI తీసుకున్న చర్య పూర్తిగా భిన్నమైనది సెంట్రల్ బ్యాంక్ విదేశాల నుండి కొత్తగా బంగారాన్ని కొనుగోలు చేయలేదు. బదులుగా ఇప్పటికే తన ఆధీనంలో ఉన్న బంగారాన్ని విదేశీ ఖజానాల నుండి భారతదేశానికి తరలించింది.
ఆర్బీఐ (RBI) అర్ధ వార్షిక నివేదిక ప్రకారం, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో 60.08 టన్నుల బంగారాన్ని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చారు. సెప్టెంబర్ 2026 చివరి నాటికి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వద్ద మొత్తం 880.52 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఇందులో 740.13 టన్నుల బంగారం భారతదేశంలోనే ఉండగా, మిగిలిన 140.39 టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వద్ద సురక్షితంగా భద్రపరిచారు.
మార్చి 2026 చివరి నాటికి భారతదేశంలో 680.05 టన్నుల బంగారం ఉండేది; అంటే ఆరు నెలల కాలంలో దేశీయంగా నిల్వ ఉన్న బంగారంలో 60.08 టన్నుల పెరుగుదల నమోదైంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే కారణమా..?.
డిసెంబర్ 5, 2025న, ద్రవ్య విధాన ప్రకటన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ అంశంపై స్పందించారు. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా బంగారం నిల్వలపై పలు దేశాలు బుల్లిష్ విధానం అమలు చేస్తున్నాయి. దీంతో ఆర్బీఐ సైతం తన బంగారు నిల్వలను వైవిధ్యపరుస్తోందని (diversifying) గవర్నర్ పేర్కొన్నారు. మొత్తం బంగారాన్ని ఒకే చోట ఉంచడం సరైనది కాదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బంగారు నిల్వలను వేర్వేరు ప్రాంతాల్లో నిల్వ ఉంచడమే దీని వెనుక ఉన్న వ్యూహంగా తెలిపారు.