భారత రాజ్యాంగం అసాధారణమైనదని, సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి సైతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగే అవకాశం కల్పించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు…తన జీవిత ప్రయాణంలోనూ రాజ్యాంగం విడదీయలేని భాగమని పేర్కొన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం వివిధ పత్రికల్లో ప్రచురితమైన తన వ్యాసంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగం వల్లే ఈ స్థాయికి..
చిన్నతనంలో తాను పెరిగిన సాధారణ కుటుంబ పరిస్థితులు, ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటే రాజ్యాంగం పట్ల కృతజ్ఞతాభావం కలుగుతుందని మోదీ తెలిపారు. ఎలాంటి ప్రత్యేక అవకాశాలు, కుటుంబ నేపథ్యం లేని వ్యక్తికి దేశానికి సేవ చేసే బాధ్యత దక్కడం భారత రాజ్యాంగ గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యం.
1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని మోదీ గుర్తు చేశారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో పాటు రాజ్యాంగ పరిషత్ సభ్యుల సేవలను కొనియాడారు. భారతీయ నాగరికత, సంప్రదాయాల విజ్ఞానాన్ని ఆధునిక రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు. రాజ్యాంగం కేవలం పార్లమెంటు, న్యాయస్థానాలకే పరిమితం కాకుండా ప్రజలందరి జీవితాల్లో భాగం కావాలన్నారు. అందుకే పదేళ్ల క్రితం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.