రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్, చైనా సరిహద్దుల నుంచి ఎదురయ్యే వైమానిక ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలను సిద్ధం చేస్తోంది..ఇందులో భాగంగా ఇప్పటికే రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 వాయు రక్షణ వ్యవస్థలను దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించింది.
ఇప్పుడు మరో S-400 వ్యవస్థను జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఫిబ్రవరి 2027 నాటికి ఐదో S-400!
భారత్ వద్ద ప్రస్తుతం నాలుగు S-400 వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మూడు పశ్చిమ సరిహద్దు వెంబడి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో మోహరించారు. నాలుగో వ్యవస్థను ఈశాన్య ప్రాంతంలోని అస్సాంలో ఏర్పాటు చేశారు. ఇది చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి రక్షణ సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఇక 2018లో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రావాల్సిన ఐదో S-400 వ్యవస్థను 2027 జనవరి-ఫిబ్రవరి మధ్య భారత్కు అందించే అవకాశం ఉంది. ఈ వ్యవస్థను జమ్మూ కాశ్మీర్లోని పాకిస్థాన్ సరిహద్దు వెంబడి మోహరించే యోచన ఉన్నట్లు సమాచారం. దీనివల్ల నియంత్రణ రేఖ (LoC) వద్ద భారత వాయు రక్షణ సామర్థ్యం మరింత పెరగనుంది.
మరో ఐదు S-400ల కొనుగోలుకు ప్రయత్నాలు!..
భారత్ ఇంతటితో ఆగడం లేదు. రష్యా నుంచి అదనంగా మరో ఐదు S-400 స్క్వాడ్రన్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిపాదిత ఒప్పందం విలువ రూ.50 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ కొనుగోలుకు సంబంధించి రష్యా తన ప్రతిపాదనను భారత రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించినట్లు ఆగస్టు 2026లో నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ ఒప్పందం ఇంకా తుది దశకు చేరలేదు. కొనుగోలు ఖరారైతే పశ్చిమ, తూర్పు సరిహద్దుల్లో భారత రక్షణ వ్యవస్థను మరింత విస్తరించే అవకాశం ఉంటుంది.