కాంగ్రెస్‌ మరింత వేధించొచ్చు.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. కేటీఆర్‌ పిలుపు.. !

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తమ వైఫల్యాలను, అవినీతిని ఎండగడుతున్నందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ మీద వాళ్లు అసహనంతో ఉన్నారని తెలిపారు.

కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎత్తిచూపడంలో మద్దతు పలికిన బీఆర్‌ఎస్‌ నాయకులు, సోషల్‌మీడియా వారియర్స్‌కు ఈ సందర్భంగా కేటీఆర్‌ ధన్యవాదాలు కేటీఆర్‌ తెలిపారు.గత రెండు రోజులుగా మనం చూసింది సుదీర్ఘమైన రాజకీయ కక్ష సాధింపుల ప్రహాసనంలో తొలి అంకం మాత్రమే అని కేటీఆర్‌ అన్నారు. రానున్న రోజుల్లో అనేక విధాలుగా బురదజల్లేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. అందుకే ఈ కుట్రలు, వ్యక్తిగత దాడులు, అబద్దపు ప్రచారాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అక్రమ కేసులు పెడతారని.. డీప్‌ఫెక్‌ టెక్నాలజీతో వీడియోలు వదులుతారని.. పెయిడ్‌ ఆర్టిస్టులతో నాటకాలు వేస్తారని కేటీఆర్‌ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీలు తమ పెయిడ్‌ సోషల్‌మీడియా ట్రోల్స్‌ అందరూ మనపై దాడికి ఏకమవుతారని పేర్కొన్నారు. ఈ దాడులను చూసి ఆగం కావద్దని.. ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటంలో ఏ మాత్రం పక్కకు జరగవద్దని సూచించారు.
తెలంగాణ ప్రజల బాగు కోసం మనం చేస్తున్న పోరాటాన్ని కొనసాగిద్దామని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ అవినీతి, అసమర్థత, ద్వంద్వ నీతిని ఎప్పటికప్పుడు బయటపెడదామని సూచించారు. ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలులో రేవంత్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజాక్షేత్రంలో శిక్షిద్దామని పిలుపునిచ్చారు.