పింఛను డబ్బుతో ఉడాయించిన గ్రామ సచివాలయ ఉద్యోగి అరెస్ట్..!

సామాజిక పింఛన్ల డబ్బుతో ఉడాయించిన కేసులో ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి సచివాలయం సంక్షేమ విద్యా సహాయకుడు బాణావతు గోవర్ధన్‌ను అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై ఉమా మహేశ్వరరావు తెలిపారు.

ఈపూరు, న్యూస్‌టుడే : సామాజిక పింఛన్ల డబ్బుతో ఉడాయించిన కేసులో ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి సచివాలయం సంక్షేమ విద్యా సహాయకుడు బాణావతు గోవర్ధన్‌ను అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై ఉమా మహేశ్వరరావు తెలిపారు. గోవర్ధన్‌కు గ్రామంలో సామాజిక పింఛన్లు పంపిణీ బాధ్యతలు అప్పగించారు. 1న కొంతమంది లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేసి సాయంత్రం నుంచి అతను అదృశ్యమయ్యాడు. ఇంకా 39 మందికి పంపిణీ చేయకుండా రూ.1.76 లక్షలు డబ్బు తీసుకుని పరారయ్యాడు. దీంతో పంచాయతీ కార్యదర్శి రావులపల్లి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న గోవర్ధన్‌ను అరెస్ట్‌ చేసి రూ.1,22,500 స్వాధీనం చేసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 వరకు రిమాండ్‌ విధించినట్లు ఎస్సై తెలిపారు.
రెండుసార్లు డబ్బు స్వాధీనం ఎలా?

ఇదిలా ఉండగా నిందితుడు పింఛను డబ్బుతో పరారైన అనంతరం అతని బంధువులు వచ్చి పంచాయతీ కార్యదర్శికి రూ.1.76 లక్షలు ఇచ్చినట్లు.. ఆ డబ్బును గ్రామంలోని లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి అతని నుంచి రూ.1,22,500 స్వాధీనం చేసుకున్నారు. అంటే నిందితుని వద్ద నుంచి రెండుసార్లు డబ్బులు వసూలు చేశారు. పింఛను డబ్బుతో గోవర్ధన్‌ పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు అతను దొరక్క ముందే బంధువుల నుంచి డబ్బులు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.