తిరుపరంకుండ్రం కొండపై కార్తీక మహాదీపం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలిగిన జ్యోతి!..
వందేళ్ల తర్వాత వెలిగిన తిరుప్పరంకుండ్రం కొండ పై దీపం
తిరుపరంకుండ్రం కొండపై కార్తీక మహాదీపం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలిగిన జ్యోతి!..
తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మధురై తిరుపరంకుండ్రం కొండపై మంగళవారం సాయంత్రం కార్తిక మహాదీపాన్ని శాస్త్రోక్తంగా వెలిగించారు. కొండపై ఉన్న ఉచ్చి పిళ్ళైయార్ దీప మండపంలో ఆలయ అధికారులు ఈ సాంప్రదాయ క్రతువును నిర్వహించారు. అయితే, కొండపై ఉన్న ‘దీపత్తూన్’ (రాతి స్తంభం) వద్ద దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, మండపంలో మాత్రమే దీపాన్ని వెలిగించడం తీవ్ర వివాదానికి, నిరసనలకు దారితీసింది.
వేడుకను చూసేందుకు సాధారణ భక్తులకు కొండపైకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. అధికారికంగా అనుమతి పొందిన 50 మంది భక్తులకు మాత్రమే దీపం వెలిగించే కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం కల్పించారు. నవంబరు 24న జరిగిన కార్తీక దీపోత్సవం సందర్భంగా ఉచ్చి పిళ్లయార్ ఆలయం సమీపంలోనే మహాదీపాన్ని వెలిగించారు. దీపతూన్ వద్ద కూడా దీపం వెలిగించాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదన్న అంశం వివాదానికి దారితీసింది. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. నవంబర్ 27న తమిళనాడు ప్రభుత్వానికి ధిక్కార నోటీసులు జారీ చేసింది (Thiruparankundram Hill).
గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా, బహిరంగంగా ఉల్లంఘించారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది (Madurai Deepam Row). నవంబర్ 28న దీపతూన్ వద్ద దీపం వెలిగించాలని మరోసారి ఆదేశించింది. ఆలయ పాలక మండలిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీపం వెలిగించే కార్యక్రమం పర్యవేక్షణ కోసం మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు శనివారం ఉదయం చెన్నై నుంచి మదురై చేరుకున్నారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం దీపం వెలిగించేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు.
మహాదీపం వెలిగించిన అనంతరం అరుళ్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) జి. సెల్వి, ధర్మకర్తల మండలి చైర్మన్ వి. షణ్ముఖసుందరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం, ఆగమ శాస్త్ర నియమాలను గౌరవిస్తూ తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారమే ఉచ్చి పిళ్ళైయార్ మండపంలో దీపం వెలిగించినట్లు వారు స్పష్టం చేశారు. సుబ్రమణ్య స్వామి ఆరు ప్రసిద్ధ క్షేత్రాలలో తిరుపరంకుండ్రం మొదటిదని, ఏడాది పొడవునా జరిగే అన్ని ఉత్సవాల్లోనూ స్థానిక ఆచారాలనే అనుసరిస్తున్నామని, కార్తిక దీపోత్సవం కూడా అందులో భాగమేనని అధికారులు వివరించారు.
తిరుపరంకుండ్రం కొండ దిగువన సుబ్రమణ్య స్వామి ఆలయం ఉండగా, కొండ పైభాగంలో సికందర్ బాదుషా దర్గా ఉంది. ఈ దర్గాకు దాదాపు 50 మీటర్ల దూరంలో ‘దీపత్తూన్’గా పిలిచే పురాతన రాతి స్తంభం ఉంది. సంప్రదాయబద్ధంగా మండపంలో వెలిగించే దీపంతో పాటు ఈ రాతి స్తంభం వద్ద కూడా దీపం వెలిగించాలా వద్దా అనే అంశంపై వివాదం నెలకొంది. ఈ ఏడాది కార్తిక దీపోత్సవం సందర్భంగా దీపత్తూన్ వద్ద కూడా దీపం వెలిగించాలని నవంబర్ 20న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మధురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ మంగళవారం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌కు తెలిపారు.
మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొండ పరిసరాలతో పాటు మదురై అంతటా అధికారులు నిషేధాజ్ఞలు అమలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 6,000 మంది పోలీసులను మోహరించారు. తిరుపరంకుండ్రం వెళ్లేందుకు ప్రయత్నించిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ను మధ్యాహ్నం తిరునెల్వేలి జిల్లాలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం దీపోత్సవ క్రతువు ముగిసిన అనంతరం, కొండ పాదాల వద్ద నిరసనకు దిగిన భక్తులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. అటు రాజధాని చెన్నైలోని సెంట్రల్ రైల్వే స్టేషన్ వెలుపల హిందూ మున్నాని కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.