తొలి టీ20 లో సౌత్ ఆఫ్రికా పై భారత్ విజయం..!

Ind vs sa..సౌతాఫ్రికా పర్యటనను టీమిండియా విజయంతో ప్రారంభించింది. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య సౌతాఫ్రికాను ఓడించింది.ముందుగా బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ సత్తా చాటగా.. బౌలింగ్‌లో వరుణ్ చక్రర్తీ దుమ్మురేపాడు. ఒకే ఓవర్‌లో డేంజరస్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, హెన్రీచ్ క్లాసెన్‌లను పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్‌(50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. తిలక్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) దూకుడుగా ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ(3/37) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25), ర్యాన్ రికెల్టన్(11 బంతుల్లో3 ఫోర్లు, సిక్స్‌తో 21), గెరాల్డ్ కోయిట్జీ(11 బంతుల్లో 3 సిక్స్‌లతో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/25), రవి బిష్ణోయ్(3/28) మూడేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు ఓ వికెట్ దక్కింది..

భారీ సిక్సర్లతో ఊచకోత..

ఓపెనర్ అభిషేక్ శర్మ(7) విఫలమైనా.. సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(33)లతో కలిసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సంజూ శాంసన్.. భారీ సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ శాంసన్.. మరో 20 బంతుల్లోనే సెంచరీని అందుకోవడం విశేషం.

సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించిన సంజూ శాంసన్.. తిలక్ వర్మతో కలిసి మూడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు…

ధోనీ రికార్డ్ బద్దలు..

ఈ శతక ఇన్నింగ్స్‌తో సంజూ శాంసన్ తన పేరిట పలు రికార్డులను లిఖించుకున్నాడు. ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఫీట్ సాధించేందుకు సంజూ శాంసన్ 269 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించాడు.

ఈ జాబితాలో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 197 ఇన్నింగ్స్‌ల్లో 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(212), శిఖర్ ధావన్(246), సూర్యకుమార్ యాదవ్(249), సురేశ్ రైనా(251), సంజూ శాంసన్ కన్నా ముందున్నారు. రాబిన్ ఊతప్ప, మహేంద్ర సింగ్ ధోనీ 7వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు 269, 365 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు.

పంత్‌ను అధిగమించిన సంజూ..

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన మూడో బ్యాటర్‌గా సంజూ శాంసన్.. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ సరసన నిలిచాడు. ఈ ముగ్గురూ ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20ల్లో మూడేసి 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశారు. ఈ క్రమంలో పంత్(2), ధోనీ(2) రికార్డులను సంజూ శాంసన్ అధిగమించాడు.