ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి సీఎం స్థాయిలో ప్రొటోకాల్‌..!?

లగచర్ల ఘటనపై కలెక్టర్‌ను కలిసేందుకు మందీమార్బలంతో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి సీఎం స్థాయిలో ప్రొటోకాల్‌ కల్పించడం వివాదాస్పదమైంది. ఏ హోదా లేని తిరుపతిరెడ్డి కోసం కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, అధికారులు బయటకువచ్చి స్వాగతం పలకడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే ఘటనకు సంబంధించి కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణను మాత్రం మన్నెగూడ పోలీస్‌ స్టేషన్‌ వద్ద పోలీసులు అడ్డుకోవడం గమనార్హం..

లగచర్ల ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలుసుకున్న మాజీమంత్రి హరీశ్‌రావు వస్తున్నారన్న సమాచారంతో హైవేపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. పూడూరు మండలం చన్గోముల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గత మూడు రోజులుగా హైవేపై విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి.