గాడిద పాల కుంభకోణం.. ఏపీ, తెలంగాణలో 100కోట్ల మోసం…!

ఇటీవల ఎక్కడ చూసినా గాడిద పాల గురించి విస్తృత చర్చ సాగుతుంది. మార్కెట్లో దీనికున్న హైప్‌, డిమాండ్‌ను ఆసరాగా తీసుకుని తమిళనాడుకు చెందిన ఓ ముఠా గాడిద పాల ఉత్పత్తి, లాభాల పేరుతో ఆశ చూపి ఔత్సాహిక రైతులను నమ్మించి మోసం చేసింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో గాడిదపాల కుంభకోణం వెలుగు చూసింది.ఓ సంస్థ ఫ్రాంచైజీ పద్దతిలో గాడిద పాలు తీసుకొని దాదాపు రూ.100 కోట్ల వరకు ఎగవేసిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధిత రైతులు తమ గోడు వెలిబుచ్చారు. చైన్నైలోని డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు సభ్యులు తమను నమ్మించి నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు..కొవిడ్‌ నేపథ్యంలో బహుళ పోషకాలు, రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్‌ ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో అవి చూసి వారిని సంప్రదించామని బాధితులు తెలిపారు. డాంకీ ప్యాలెస్‌ మిస్టర్‌ బాబు ఉలగనాథన్‌ ఆధ్వర్యంలో గిరి సుందర్‌, బాలాజీ, సోనికరెడ్డి, డాక్టర్‌ రమేశ్‌ బృందం సెక్యూరిటీ డిపాజిట్‌ కింద ఒక్క రైతు వద్ద రూ.5లక్షలు తీసుకున్నారు….

కొట్లకోసం పొతే ఉన్నవి పోయినవి..!

గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే రూ.కోట్లు గడించవచ్చని కేటుగాళ్లు కొందరిని నమ్మించారు. వీరి మాటలు నమ్మి రూ.20 లక్షల నుంచి రూ.90 లక్షల వరకూ చాలామంది పెట్టుబడులు పెట్టారు. గ‌తేడాది జూలై 23న త‌మిళ‌నాడులో ది డాంకీ ప్యాలెస్‌ను ప్రారంభించిన అనంతరం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అధిక లాభాలు పొందొచ్చంటూ ఆశ చూపారు.

400 మంది రైతులు.. రూ.100 కోట్ల నష్టం..

దీనిపై ప్రశ్నిస్తే ఒక్కొక్కరికీ రూ.15 లక్షల నుంచి రూ.70 లక్షల వరకూ బ్యాంకు చెక్కులు రాసిచ్చారని బాధితులు తెలిపారు. ‘ఈ చెక్కులు బ్యాంకులో వేస్తే బౌన్సయ్యాయి. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 400 మందికి పైగా రైతులు తమలాగా రూ.100 కోట్ల వరకూ నష్టపోయారు. ఇదో పెద్ద స్కాం. దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చు. ఈ విషయంపై చెన్నై పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదు. ఒప్పందం క్రమంలో ఇచ్చిన జీఎస్టీ సంఖ్య, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కూడా నకిలీవేనని తేలింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు న్యాయం చేయాలి..’ అని బాధితులు ఆందోళన చెందారు..