ఇటీవల జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్రలో ప్రస్తుత మహాయుతి కూటమి అధికారాన్ని తిరిగి చేజిక్కించుకుంటుందని.. కానీ జార్ఖండ్లో మాత్రం అధికార మార్పు ఖాయమని అంచనా వేశాయి. కానీ తుది ఫలితాలు వెల్లడయ్యేసరికి మాత్రం మహారాష్ట్రాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందుకోగా.. జార్ఖండ్లో మాత్రం బెడిసికొట్టాయి. ప్రస్తుతం జేఎంఎం ఆధ్వర్యంలో అధికారంలో ఉన్న ఇండియా కూటమి.. తిరిగి బంపర్ విక్టరీ దిశగా దూసుకెళ్తోంది. మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి..
జార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక్కడ ఇండియా కూటమి గెలుపు దాదాపు ఖరారైంది. అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలను ఇండియా కూటమి దాటిపోయింది..దీంతో కాంగ్రెస్ (Congress) కీలక సమావేశం నిర్వహించింది. శనివారం ఉదయం జార్ఖండ్ కాంగ్రెస్ ఇంచార్జి గులాం అహ్మద్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు జార్ఖండ్ కు పరిశీలకులుగా ఏఐసీసీ నియమించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramakra), తారిఖ్ అన్వర్, కృష్ణ అల్లవూరితో పాటు ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ రాజేష్ ఠాకూర్ హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. కాగా జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఈసీ గణాంకాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల వరకు జేఎంఎం 28, కాంగ్రెస్ 15, బీజేపీ 27, ఆర్ జేడీ 5, సీపీఐ(ఎంఎల్), (ఎల్) 2, ఏజేఎస్ యూపీ 1, ఎల్ జే పీఆర్ వీ 1, ఇతరులు 2 చొప్పున విజయం సాధించారు. ఫలితాలు కొనసాగుతున్నాయి.