మతం మారినంత మాత్రాన బీసీ రిజర్వేషన్ పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ మతం నుంచి ఇస్లాం వంటి ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు, తమ పాత సామాజిక వర్గం ఆధారంగా బీసీ రిజర్వేషన్ను కోరలేరని తేల్చిచెప్పింది. ఒక మతంలో ఉన్న సామాజిక వెనకబాటుతనాన్ని మరో మతంలోకి మారిన తర్వాత కూడా అదే విధంగా పరిగణించలేమని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఆ అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ శ్రీఛంద్రశేఖర్తో కూడిన ధర్మాసనం గురువారం ఆ తీర్పు వెలువరించింది. హిందూ సామాజిక వ్యవస్థ నుంచి మరో మతంలోకి మారిన వ్యక్తి, గతంలో తన సామాజిక వర్గానికి ఉన్న వెనకబాటుతనాన్ని చూపించి రిజర్వేషన్ పొందలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది..
మతం మారినంత మాత్రాన.. రిజర్వేషన్లు, వెనుకబడిన వర్గాల హోదా వంటి ప్రయోజనాలు ఆటోమేటిగ్గా పొందలేరని పేర్కొంది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది…
తమిళనాడులో హిందూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఇస్లాం మతంలోకి మారినవారికి బీసీ ముస్లిం కేటగిరీలో కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తూ 2024 మార్చిలో ఉత్తర్వులు జారీచేసింది. మతం మారినంత మాత్రాన గతంలో పొందుతున్న రిజర్వేషన్ ప్రయోజనాలను కోల్పోకూడదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది…2015లో హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన సమీర్ అహ్మద్ అనే వ్యక్తి.. తనను ముస్లిం లబ్బాయిస్ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తిస్తూ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక తహసీల్దార్ అప్లికేషన్ను రిజెక్ట్ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్ధతపై వివాదం రాజుకుంది. ప్రభుత్వం నోటిఫై చేసిన 7 బీసీ ముస్లిం సామాజిక వర్గాల్లో.. కేవలం మత మార్పిడితోనే సభ్యత్వం లభించదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆయా వర్గాల్లో జన్మతః ఆధారంగా సమాజ గుర్తింపు కీలకమని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. అక్కడా ఊరట దక్కలేదు..
తమిళనాడులో బీసీ, అత్యంత వెనకబడిన వర్గాలు, కొన్ని ఇతర సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. వీటిలోని కొందరు వ్యక్తులు ఇస్లాంలోకి మారిన తర్వాత కూడా రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 9న ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారం, బీసీ, అత్యంత వెనకబడిన వర్గాలు, కొన్ని ఇతర వర్గాలకు చెందిన వ్యక్తులు ఇస్లాంలోకి మారితే, వారిని గుర్తించిన ఏడు ముస్లిం సామాజిక వర్గాల్లో ఒకదానికి చెందినవారిగా పరిగణించే అవకాశం కల్పించారు. దీనికి అనుగుణంగా వారికి సంబంధిత సామాజిక వర్గ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పత్రాల ఆధారంగా బీసీ ముస్లింలకు వర్తించే రిజర్వేషన్ పొందేందుకు అవకాశం కల్పించాలన్నది ఈ జీవో ఉద్దేశం.