ఉత్తరప్రదేశ్లోని సంభల్లో ఇటీవల హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు బయల్దేరిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అడ్డుకున్నారు..
స్థానికేతరులు అక్కడికి రావడంపై ఆంక్షలున్న నేపథ్యంలో ఘాజీపుర్ సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీల వాహనాలను యూపీ పోలీసులు అడ్డగించారు. (Rahul, Priyanka Gandhi stopped at Ghazipur border)
రాహుల్, ప్రియాంక (Priyanka Gandhi) సంభల్ పర్యటనకు సిద్ధమైన నేపథ్యంలో ఈ బుధవారం ఉదయం నుంచే దిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘాజీపుర్ సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకోగా పోలీసులు వారిని నిలువరించారు. దీంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు, ఈ పరిణామాలతో ఘాజీపుర్ సరిహద్దు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు..