ముఖ్యమంత్రి విష్ణుదేవ్ ఒక ముసుగు అని, అతను కార్పొరేట్‌కు నంబర్ వన్ ఏజెంట్ అని చత్తీస్ గడ్ మావోయిస్ట్ లు ఆరోపించారు.. సిఎం హోదాలో పారిశ్రామిక వేత్తలకు ఊడిగం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) చత్తీస్ గడ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో సమతా పేరిట సంచలన లేఖను నేడు మావోయిస్టులు విదుదల చేశారు. ఆ లేఖలో పోలీసు రిక్రూట్మెంట్లో గిరిజన యువతకు ఎత్తు, ఛాతీ కొలతల్లో సడలింపు ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉందని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ను పోలీసు రాజ్యంగా చేసి గిరిజన సమాజాన్ని నాశనం చేసే కుట్రను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ను కార్పోరేట్ కంపెనీలకు చౌకగా సేవలందించేందుకు గిరిజన యువతను పోలీసు శాఖలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు మావోయిస్ట్ లు.. రాష్ట్రంలో అనేక విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు రిక్రూట్మెంట్ చేయకుండా కేవలం పోలీసు రిక్రూట్మెంట్ మాత్రమే నిరంతరం జరుగుతోందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, టెలిఫోన్లు, వంతెనలు, రైల్వే లైన్లు, ఓడల స్థావరాలు తదితరాలను కార్పొరేట్ల కోసం నిర్మిస్తున్నారని మండిపడ్డారు. వాటి భద్రత కోసం గిరిజన బిడ్డలను పోలీసులుగా మార్చి అక్కడ మొహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఖాకీలు ఇక నిత్యం గ్రామాలు, పొలాల్లో బాంబులను పేల్చుతున్నారని, ప్రతిరోజూ గ్రామాలపై దాడులు చేసి వందలాది మందిని అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారని వెల్లడించారు. గిరిజన సమాజాన్ని కాపాడాలంటే ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వాలపై బలమైన ఉద్యమం జరగాలి అంటూ లేఖలో ప్రధానంగా ప్రస్థావించారు మావోలు. ముఖ్యమంత్రి కూడా తన పాసిస్ట్ చర్యలకు మంగళం పాడకపోతే తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు..