సిఎం యోగి తలను నరుకుతానంటూ హెచ్చరిక ఫేస్‌బుక్ పోస్ట్ కలకలం..!..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాకు చెందిన ఓ యువకుడు తన ఫేస్‌బుక్‌ ఖాతా వేదికగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బెదిరించాడు. ముఖ్యమంత్రి యోగి తలను నరుకుతానంటూ హెచ్చరిక చేశాడు..ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాను జరగనిచ్చేది లేదన్నాడు. అంతటితో ఆగకుండా హిందూ దేవుళ్లు, దేవతలపై.. అయోధ్యలో రామమందిరంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మైజాన్ రజా అనే ఫేస్‌బుక్ ఐడీ నుంచి యువకుడు ఈ వివాదాస్పద పోస్టులు పెట్టాడు. వీటిపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
బరేలీలోని అగస్త్య ముని ఆశ్రమానికి చెందిన పండితుడు కేకే శంఖధార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ అభ్యంతరకర ఫేస్‌బుక్ పోస్ట్ గురించి పోలీసులకు(CM Yogi) ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దాని ఆధారంగా విచారణ మొదలుపెట్టిన బరేలీలోని ప్రేమ్ నగర్ ఏరియా పోలీసులు.. ఆ పోస్టు పెట్టిన యువకుడి ఆచూకీని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం యోగికి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు ? మహాకుంభ మేళాను ఆపాలని ఎందుకు భావిస్తున్నాడు ? అనే కోణంలో సదరు యువకుడిని పోలీసులు విచారించే అవకాశం ఉంది.