అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్రానికి రాహూల్ గాంధీ…!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇవాళ (మంగళవారం) అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఇంతకీ ఎందుకు ? అనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్ ప‌ర్యట‌న ఖ‌రారైంది. ఇవాళ మ‌ధ్యాహ్నం 2.45 గంట‌ల‌కు దిల్లీలో బ‌య‌లు దేరనున్న రాహుల్ గాంధీ, సాయ‌త్రం 5 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి సాయంత్రం 5.15 గంట‌ల‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో బ‌య‌లుదేరి సాయంత్రం 6 గంట‌ల‌కు వ‌రంగ‌ల్ చేరుకుంటారు..

రాహుల్ నేటి టూర్..

రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఈరోజు(మంగళవారం) సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు విమానంలో చేరుకుంటారు.
అక్కడి నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌కు చేరుకుంటారు.
వరంగల్‌లోని హన్మకొండ నగరంలో ఉన్న సుప్రభ హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.
అనంతరం హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో రాహుల్‌ సమావేశం అవుతారు.
బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాల్లో తెలంగాణ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని రాష్ట్ర సర్కారు చెబుతోంది. ఈ అంశాల్లో ప్రజా స్పందన ఎలా ఉందనే దానిపై రాహుల్‌గాంధీ ఆరా తీయనున్నారు.
ఈరోజు రాత్రి 7.30 గంటలకు వరంగల్ నుంచి రైలులో చెన్నైకి రాహుల్ బయలుదేరి వెళ్తారు.
కేంద్ర ప్రభుత్వం రైల్వేలను ప్రైవేటీకరించే యత్నం చేస్తోందని రాహుల్ అంటున్నారు. ఈ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి ఆయన అభిప్రాయాలను సేకరించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ పోస్టు కోసం రెడ్డి, ఎస్టీ కోటాలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ సీనియర్‍ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో కనీసం ఒకరికి ఆ పదవి దక్కుతుందని అంచనా వేస్తున్నారు.
వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‍రెడ్డి, మహబూబాబాద్‍ ఎంపీ బలరాం నాయక్‍లు రాహుల్‌గాంధీని వరంగల్‌లో కలిసే అవకాశం ఉంది. పార్టీ పదవుల కేటాయింపులో తమ పేర్లను పరిశీలించాలని విన్నవించే ఛాన్స్ ఉంది..