దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగుపై.. మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, రామ భక్తుల జయజయ ధ్వనాల మధ్య అభిజిత్ లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12.13 గంటలకు భద్రాద్రి సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. మిథిలా స్టేడియంలోని మిథిలా మండపంలో జరిగిన భద్రాద్రి రామయ్య పెళ్లిని తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి వేలాదిగా భక్తుల తరలివచ్చారు..
సీఎం హోదాలో తొలిసారి భద్రచాలానికి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా భద్రాచలం రామయ్య ఆలయానికి వచ్చారు. సీఎం దంపతులు రామయ్యకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కూడా పట్టు వస్త్రాలు స్వామి వారికి సమర్పించారు. ఈ కల్యాణ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క దంపతులు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు..