వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ సొంతగడ్డపై సత్తా చాటింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగడంతో 246 పరుగుల లక్ష్యాన్ని సులభంగానే చేధించింది. అభిషేక్ శర్మ (141; 55 బంతుల్లో 14×4 10×6) దంచికొట్టడంతో 9 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది..
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జూలు విదిల్చింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పంజాబ్ నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 18.3 ఓవర్లలో 247/2 స్కోరు చేసింది. అభిషేక్‌శర్మ(55 బంతుల్లో 141, 14ఫోర్లు, 10 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. అభిషేక్‌కు తోడు హెడ్(66) జత కలువడంతో రైజర్స్ గెలుపు నల్లేరుపై నడక అయ్యింది. అర్ష్‌దీప్‌సింగ్, చాహల్‌కు ఒక్కో వికెట్ దక్కింది. తొలుత శ్రేయాస్ అయ్యర్(36 బంతుల్లో 82, 6ఫోర్లు, 6సిక్స్‌లు) అర్ధసెంచరీతో పంజాబ్ 20 ఓవర్లలో 245/6 స్కోరు చేసింది. హర్షల్(4/42) నాలుగు వికెట్లు తీశాడు. అభిషేక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యుత్తమ ఛేదనగా హైదరాబాద్, పంజాబ్ పోరు నిలిచింది.
అభిషేక్ హోరు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్‌శర్మ..ఉప్పల్‌లో అభిమానులకు పూనకాలు తెప్పించాడు. పంజాబ్ నిర్దేశించిన 246 పరుగుల భారీ లక్ష్యఛేదనలో హైదరాబాద్‌కు అభిషేక్ ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. హెడ్‌ను అండగా చేసుకుంటూ అభిషేక్..విధ్వంస రచనకు శ్రీకారం చుట్టాడు. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టొయినిస్ ఇచ్చిన లైఫ్‌ను వినియోగించుకున్న శర్మ..యాన్సెన్‌ను హ్యాట్రిక్ ఫోర్లతో అరుసుకున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేసే అర్ష్‌దీప్‌సింగ్‌ను లక్ష్యంగా చేసుకున్న హెడ్ మూడు ఫోర్లు కొట్టడంతో మూడో ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ఓవైపు అభిషేక్, మరోవైపు హెడ్ దంచుడుతో పంజాబ్ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. వీరి జోరుకు అడ్డుకట్ట వేసేందుకు పంజాబ్ కెప్టెన్ అయ్యర్ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. 20 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్న అభిషేక్..లక్ష్యాన్ని అంతకంతకూ కరిగించుకుంటూ పోయాడు. దూకుడు ప్రదర్శించిన అభిషేక్ మరో 20 బంతుల్లో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. 100 పరుగులకు చేరుకోగానే తన జేబులో నుంచి చిట్టి తీస్తూ సంబురాలు చేసుకున్నాడు. హెడ్ ఔటైనా ఎక్కడా జోరు తగ్గించని శర్మ..తన కెరీర్లో అత్యుత్తమ స్కోరు అందుకుని అర్ష్‌దీప్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆఖర్లో క్లాసెన్(21 నాటౌట్), ఇషాన్‌కిషన్(9 నాటౌట్) మరో 9 బంతులు మిగిలుండగానే గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.
అయ్యర్ అదుర్స్:
పంజాబ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌సింగ్..షమీని లక్ష్యంగా చేసుకుంటూ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగాడు. అంతటితో ఆగకుండా మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన షమీని ఆర్య 6,6,4 దంచగా, ప్రభ్‌సిమ్రన్ మరో సిక్స్ కొట్టాడు. ఇలా ఇద్దరు వంతులు వేసుకుంటూ మరీ బౌండరీలు బాదడంతో మూడు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 50 పరుగుల మార్క్ అందుకుంది. ఇన్నింగ్స్ దూసుకెళుతున్న తరుణంలో హర్షల్ బౌలింగ్‌లో ఆర్య(36) తొలి వికెట్‌గా ఔట్ కావడంతో 66 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్…ప్రభ్‌సిమ్రన్‌కు జతకలిశాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఇషాన్ మలింగ..7వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. మలింగ 9వ ఓవర్లో అయ్యర్ రెండు కండ్లు చెదిరే సిక్స్‌లతో ఇన్నింగ్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. నేహాల్‌ను అండగా చేసుకుంటూ జీషాన్ 12వ ఓవర్లో అయ్యర్ రెండు భారీ సిక్స్‌లకు తోడు ఫోర్‌తో చెలరేగడంతో 20 పరుగులు వచ్చి చేరాయి. ఈ క్రమంలో ఐపీఎల్లో 22 బంతుల్లోనే అయ్యర్ వేగవంతమైన అర్ధసెంచరీని నమోదు చేసుకున్నాడు.హర్షల్ ఈసారి..శశాంక్(2),అయ్యర్‌తో పాటు మ్యాక్స్‌వెల్(3)ను పెవిలియన్ పంపాడు. షమీ ఆఖరి ఓవర్లో స్టొయినిస్ నాలుగు సిక్స్‌లు కొట్టి స్కోరును 245 పరుగులకు తీసుకొచ్చాడు.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 20 ఓవర్లలో 245/6(అయ్యర్ 82, ప్రభ్‌సిమ్రన్ 42, హర్షల్ పటేల్ 4/42, మలింగ 2/45), హైదరాబాద్: 18.3 ఓవర్లలో 247/2(అభిషేక్ 141, హెడ్ 66, అర్ష్‌దీప్‌సింగ్ 1/37, చాహల్ 1/56.