పాకిస్తాన్ కు అండగా ఉంటాం:చైనా..

భారత్ పాకిస్థాన్ మద్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో చైనా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో పాక్ కు అండగా నిలుస్తామని పేర్కొంది. పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌తో జరిగిన ఫోన్‌ సంభాషణలో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంభాషణ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వాంగ్‌యీకు పాక్‌ మంత్రి వివరించినట్లు విదేశాంగశాఖ కార్యాలయం వెల్లడించింది.
సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ సంయమనంతో ఉందని, బాధ్యతాయుత విధానాన్ని అవలంబించిందని వాంగ్ యీ పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చైనా అన్నివేళలా వ్యూహాత్మక సహకార భాగస్వామి అని, విడదీయరాని స్నేహమని అన్నారు. దేశసార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడడంలో పాకిస్థాన్‌కు అండగా ఉంటామని చైనా చెప్పినట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు.. యూఏఈ డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ తోనూ ఇషాక్ దార్ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ అవగాహనను అబ్దుల్లా బిన్ స్వాగతించారు. అటు తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్‌తో మాట్లాడిన దార్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు.