*సూర్యాపేట జిల్లా..
అక్రమంగా శిశువులని విక్రయిస్తున్న ముఠాని అరెస్ట్ చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు . ముఠాలోని 13 మంది సభ్యులని అరెస్ట్ చేసి , 10మంది శిశువులని రెస్క్యూ చేశారు . సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ నరసింహ గౌడ్ . ముంబై గుజరాత్ ప్రాంతాల నుండి శిశువులని అక్రమంగా తీసుకొచ్చి 28 మంది శిశువులని ఏజెంట్ల ద్వారా లక్షల రూపాయలకు విక్రయించినట్లు గుర్తించారు పోలీసులు .
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నక్క యాదగిరి , ఉమారాణి దంపతులు కోడిగుడ్ల వ్యాపారం ముసుగులో గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ పిల్లలులేని దంపతులను గుర్తించి వారికి ముంబై , గుజరాత్ ప్రాంతాలకు చెందిన ముఠాల ద్వారా శిశువులని తీసుకొచ్చి ఒక్కో శిశువుని 5 నుండి 10 లక్షల వరకు అమ్మినట్లు గుర్తించారు పోలీసులు . మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ విధంగా 10 మంది శిశువుల్ని విక్రయించినట్టు ప్రాధమికంగా గుర్తించిన పోలీసులు వారిని రెస్క్యూ చేసి నల్లగొండ శిశు విహార్ కి తరలించినట్లు తెలిపారు . ముఠా సభ్యులు విజయవాడ , హైద్రాబాద్ లలోని ఫెర్టిలిటీ సెంటర్లలో పిల్లల కోసం ప్రయత్నం చేసే దంపతులను గుర్తించి వారి వద్దకు కమీషన్ల ఆశ చూపి ఏజెంట్లను పంపి విక్రయాలు జరుపుతున్నారు . గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి పెట్టి అధికంగా శిశువులని విక్రయిస్తున్నారు , లీగల్ గా దత్తత తీసుకునే వ్యవస్థ మీద అవగాహన లేకపోవడంతో ఈ ముఠా ఉచ్చులో చిక్కుకుని సంతానం లేని అమాయక దంపతులు శిశువులని కొనుగోలు చేస్తున్నారు . శిశువులని ఎలా ప్రోక్యూర్ చేసుకుంటున్నారో , నిజమైన తల్లితండ్రుల వద్ద కొనుగోలు చేశారా లేదా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పూర్తి స్థాయి విచారణ అనంతరం ఈ నేరంలో భాగమైన అందరిని గుర్తించి చట్ట ప్రకారం శిక్షపడేలా చేస్తామని వెల్లడించారు ఎస్పీ నరసింహ గౌడ్ .