ట్రంప్ నుంచి ఫోన్ రాగానే నరేంద్ర మోదీ లొంగిపోయారు.. రాహుల్ గాంధీ..

ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారని ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కన్వెన్షన్లో పాల్గొన్న రాహుల్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు…ఆపరేషన్ సిందూర్ ప్రారంభం కాగానే మోదీకి ట్రంప్ ఫోన్ చేశారు. ఏం చేస్తున్నారని ఫోన్లో ట్రంప్ అడిగారు. తరువాత ‘నరేందర్ సరెండర్’ అన్నారు. అంతే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు. ఈ విధంగా ట్రంప్ ఆదేశాలను మోదీ తూచా తప్పకుండా పాటించారు.”
– రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

అమెరికాను లెక్కచేయని ఇందిరా గాంధీ
1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో అమెరికా బెదిరింపులను ఇందిరా గాంధీ లెక్క చేయకుండా, బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగేలా చేశారని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ఈ విధంగా కాంగ్రెస్ అగ్రరాజ్యం అమెరికాకు వ్యతిరేకంగా పోరాడిందని ఆయన అన్నారు.

‘1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో అమెరికా, భారత్ను బెదిరించింది. తరువాత అమెరికా తన ఏడవ నౌకాదళాన్ని, ఆయుధాలను, విమాన వాహక నౌకను పాక్కు సాయంగా పంపించింది. అయినా అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చలించలేదు. మేము ఏం కావాలంటే అదే చేస్తామని తేల్చి చెప్పింది. చివరికి 1971 యుద్ధం ద్వారా పాక్ను రెండుగా చీలేలా చేసింది’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

అందుకు చరిత్రే సాక్షి
బోఫాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ‘సంఘటన్ సృజన్ అభియాన్’ ప్రారంభించిన రాహుల్, ఆ తరువాత ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు.

“ట్రంప్ నుంచి ఫోన్ రాగానే నరేంద్ర మోదీ లొంగిపోయారు. ఇందుకు చరిత్రే సాక్షి. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ లక్షణం. వారు ఎల్లప్పుడూ తలవంచుకుంటూ ఉంటారు. నాకు బీజేపీ-ఆర్ఎస్ఎస్ వ్యక్తులు తెలుసు. మీరు కొంచెం ఒత్తిడి తెచ్చినా, ఏమాత్రం బెదిరించినా వారు భయంతో పారిపోతారు” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

తలవంచేది లేదు!
ఈ సందర్భంగా రాహుల్ తమ పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ సింహాలు, సివంగులు అగ్రరాజ్యాలతో పోరాడతాయి. వారు ఎప్పుడూ ఎవరికీ తలవంచరు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభ్ బాయ్ పటేల్ ఎప్పుడూ లొంగిపోలేదు. వారు అగ్రరాజ్యాలతో పోరాడారు’ అని రాహుల్ అన్నారు..