ఇరాన్‌ అణు రియాక్టర్‌ ధ్వంసం…40 ఫైటర్ జెట్లు, 100 బాంబులతో అటాక్..

కీలకమైన అణు కేంద్రాన్ని కూడా తాకింది.

ఇజ్రాయెల్ బాంబు దాడిలో అరాక్‌ హెవీ వాటర్‌ రియాక్టర్ ధ్వంసం
ఆ ఏరియాను ఖాళీ చేయాలని దాడికి ముందే ఇజ్రాయెల్ హెచ్చరిక
ఇరాన్ పై 40 ఫైటర్ జెట్లు, 100 బాంబులతో అటాక్..

ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్రోన్లు, మిసైళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు. ఇరాన్ న్యూక్లియర్ వ్యవస్థను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నది. బుధవారం అర్ధరాత్రి దాటాక ఇరాన్ కు చెందిన అరాక్‌ హెవీ వాటర్‌ రియాక్టర్‌ ఏరియాను ఇజ్రాయెల్ పేల్చేసింది. దాడికి ముందే ఇరాన్కు ఇజ్రాయెల్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేసింది. అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ఏరియాను ఖాళీ చేయాలని సూచించింది. ఆ తర్వాత కాసేపటికే అక్కడ ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. 40 ఫైటర్ జెట్లతో 100 బాంబులు వేసింది.

అణు బాంబుల తయారీ కోసం టెహ్రాన్‌కు ఉన్న అన్ని వనరులను నాశనం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులకు దిగుతున్నది. దీనికి కౌంటర్గా.. ఇజ్రాయెల్ బీర్‌షెవాలోని సొరొక హాస్పిటల్పై ఇరాన్ క్షిపణులు వర్షం కురిపించింది. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. శుక్రవారం నుంచి బుధవారం వరకు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు చెందిన 640 మంది చనిపోయారని ఇరానియన్ హ్యుమన్ రైట్స్ గ్రూప్ ప్రకటించింది. మృతుల్లో 263 మంది పౌరులు ఉన్నారు. 1,300 మందికిపైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్పై ఇరాన్ 400 మిసైళ్లు, వందలాది డ్రోన్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో 24 మంది చనిపోయారని, వందలాది మంది గాయపడ్డారని తెలిపింది.

యురేనియం శుద్ధి కేంద్రాలే లక్ష్యంగా దాడులు

ఇరాన్‌ న్యూక్లియర్ వెపన్స్ స్థావరాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ భీకర దాడులకు పాల్పడుతున్నది. కాగా, ఇప్పటికే పలు యురేనియం శుద్ధి కేంద్రాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్‌) ధ్వంసం చేసింది. తాజాగా అరాక్‌ హెవీ వాటర్‌ రియాక్టర్‌ ఏరియాను నామరూపాల్లేకుండా చేసింది. ఈ ప్లాంట్‌ శాటిలైట్ ఫొటోను సోషల్‌ మీడియాలో ఐడీఎఫ్ పోస్ట్‌ చేస్తూ అక్కడి ప్రజలకు వార్నింగ్‌ ఇచ్చింది. ఆ రియాక్టర్‌ సమీపంలోని ప్రజలు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని హెచ్చరించింది. ఈ పోస్ట్‌ చేసిన కొన్ని గంటలకే అరాక్‌ హెవీ వాటర్‌ రియాక్టర్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. అయితే, ప్రస్తుతానికి అక్కడ రేడియేషన్ ప్రమాదం ఏదీ లేదని తెలుస్తోంది. టెహ్రాన్, ఇస్ఫహాన్, షిరాజ్, కుర్మనాషాతో సహా మొత్తం 40 ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్‌లను తయారుచేసే కర్మాగారంపై మిస్సైళ్లను ప్రయోగించింది.

ఫ్లుటోనియం ఉత్పత్తి అయ్యేది అరాక్లోనే..

ఈ హెవీ వాటర్‌ను న్యూక్లియర్‌ రియాక్టర్లు చల్లబర్చేందుకు వాడతారు. అయితే, ఈ ప్రక్రియలో ఫ్లుటోనియం ఉత్పత్తి కూడా జరుగుతుంది. దీన్ని అణ్వాయుధాల తయారీలోనూ వినియోగిస్తారు. శుద్ధి చేసిన యురేనియం లేకుండానే అణుబాంబును అభివృద్ధి చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఇది. కాగా, 2015లో ప్రపంచదేశాలతో కలిసి ఇరాన్‌ అణుఒప్పందంపై సంతకం చేసింది. ఆ ఒప్పందానికి అనుగుణంగానే 2019లో హెవీ వాటర్‌ రియాక్టర్‌ సెకండరీ సర్క్యూట్‌ను టెహ్రాన్‌ ప్రారంభించింది. టెహ్రాన్ కు 280 కి.మీ. దూరంలో ఈ ప్లాంట్ ఉంది.

బీర్షెవా హాస్పిటల్ పై ఇరాన్ ప్రతీకార దాడి

అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ను పేల్చేయడంతో ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. బీర్‌షెవాలోని సొరొక ఆసుపత్రిపై ఇరాన్ దాడి చేసింది. ఈ అటాక్లో 40 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మిసైల్ దాడి కారణంగా హాస్పిటల్ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆస్పత్రి ప్రతినిధి వెల్లడించారు. అద్దాలు అన్నీ ధ్వంసం అయ్యాయని, పేషెంట్లను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌లోని ప్రముఖ మెడికల్‌ సెంటర్లలో ఇది ఒకటి. జవాదాబాద్‌లో ఇజ్రాయెల్కు చెందిన అత్యాధునిక ఎఫ్‌-35 ఫైటర్ జెట్ను కూల్చేసినట్లు ఇరాన్‌ ఆర్మీ ప్రకటించింది. దాదాపు రూ.140 కోట్ల విలువైన హెర్మెస్‌ డ్రోన్‌నూ డిస్ట్రాయ్ చేశామని, అత్యంత శక్తివంతమైన ఫతాహ్‌ హైపర్‌సోనిక్‌ మిసైల్ను ప్రయోగించామని ఇరాన్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్లోని టెలీ అవీవ్‌, రామత్‌గాన్‌, హోలోన్‌, బెర్జీబా నగరాలపై ఇరాన్‌ విరుచుకుపడింది. దీంతో, అక్కడ భయానక వాతావరణం నెలకొన్నది.

10 మిసైళ్లను నేలకూల్చిన ఇజ్రాయెల్

తమవైపు దూసుకొచ్చిన 10 ఇరాన్ మిసైళ్లను నేలకూల్చామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. శుక్రవారం నుంచి బుధవారం వరకు ఇరాన్ దాడులతో 15,871 చోట్ల నిర్మాణాలు, దాదాపు 1,300 వాహనాలు, 1,633 ఆస్తులు ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. బీర్‌షెవాలోని సొరొక హాస్పిటల్పై జరిగిన దాడిని ఇజ్రాయెల్ హెల్త్ మినిస్ట్రీ తీవ్రంగా ఖండించింది. 2 రోజుల కింద వరకు ఈ మెడికల్‌ సెంటర్‌ బిల్డింగ్లో వేలాది మంది పేషెంట్లు ఉన్నారు. తాజాగా దాడికి గురైన ఫ్లోర్‌ను బుధవారం మధ్యాహ్నమే ఖాళీ చేయించారు. దీంతో భారీగా ప్రాణ నష్టం తప్పింది. సొరొక మెడికల్‌ సెంటర్‌పై ఇరాన్‌ దాడి యుద్ధ నేరం కిందకు వస్తుందని ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ మంత్రి ఉరియల్‌ బుసో పేర్కొన్నారు. హాస్పిటల్పై దాడిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు.

ఖమేనీ కథ ముగిస్తం: ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ కథ ముగిస్తామని ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్‌ కట్జ్‌ ప్రకటించారు. టెల్‌ అవీవ్‌ హాస్పిటల్పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఖమేనీనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. హాస్పిటళ్లపై దాడులు చేయడం సరికాదని మండిపడ్డారు. ఇరాన్‌ను ఖమేనీ విముక్త దేశంగా మారుస్తామని ప్రకటించారు. సాధారణ ప్రజలే లక్ష్యంగా ఖమేని దాడులు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు….

రియాక్టర్‌ కేంద్రం నిర్వహ ణలో లేదని, అణు పదార్థం కాని, రేడియోధార్మిక ప్రభావం కాని ఏమీ లేదని ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) వెల్లడించింది. రియాక్టర్‌ని ఆనుకునే ఉన్న భార జల కర్మాగారంపై దాడి జరిగిన విషయం గురించి తమకు సమాచారం అందంచలేదని ఐఏఈఏ తెలిపింది. కాగా, అరాక్‌ రియాక్టర్‌పై తాము జరిపిన క్షిపణి దాడి ఫొటోలను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. రియాక్టర్‌ భవనంపైన బాంబు పడుతున్న దృశ్యాలు, భారీ పేలుడు కారణంగా మంటలు ఏర్పడి దట్టమైన పొగ వ్యాపించిన దృశ్యాలను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. యురేనియం ఉత్పత్తి కోసం అరాక్‌ రియాక్టర్‌ను ఉపయోగించకూడదన్న ఉద్దేశంతోనే దానిపై తమ ఫైటర్‌ జెట్లు దాడి జరిపినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది…