నేటి పంచాంగం… నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥥పంచాంగం🥥
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 06 – 07 – 2025,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *ఏకాదశి* రా8.15 వరకు,
నక్షత్రం : *విశాఖ* రా10.40 వరకు,
యోగం : *సాధ్యం* రా10.16 వరకు,
కరణం : *వణిజ* ఉ7.18 వరకు,
తదుపరి *భద్ర* రా8.15 వరకు,

వర్జ్యం : *తె3.04 – 4.50*
దుర్ముహూర్తము : *సా4.49 – 5.41*
అమృతకాలం : *మ12.55 – 2.42,*
రాహుకాలం : *సా4.30 – 6.00,*
యమగండం : *మ12.00 – 1.30,*
సూర్యరాశి : మిథునం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 5.34,
సూర్యాస్తమయం: 6.33,

*_నేటి విశేషం_*

*శయన ఏకాదశి/తొలి ఏకాదశి*
*గోపద్మ వ్రతం*
*చాతుర్మాసవ్రతం – ఆరంభం*
ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి శయన ఏకాదశి అని పేరు.
శ్రీ మహావిష్ణువు క్షీర సాగరంలో శయనిస్తాడు కనుక దీనికి శయన ఏకాదశి అని పేరు.
చాతుర్మాసం లో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అంటారు.

శయన ఏకాదశి అనే పేరు కూడా ఉంది, ఈ పేరు విన్నంత మాత్రం చేతనే మన మహా పాపములు నశించి పోతాయి, అంతటి మహా మహిమ కలిగిన ఏకాదశి ఇది,

పూర్వము కృతయుగము చివరి పాదములో ప్రహ్లాదుని మనుమడు విరోచన పుత్రుడు అయిన బలి చక్రవర్తి గురువుగారు శుక్రాచార్యుని కటాక్షంతో విశ్వజిత్ అనే యజ్ఞం చేసి, మహా శక్తులు పొంది …
స్వర్గం మీదకు దండెత్తి వెళ్ళి, దేవతల స్వర్గమును ఆక్రమించుకుని, అక్కడ తన ప్రతినిధులను పెట్టి భూలోకంలో నర్మదా నది తీరంలో యాగములు చేస్తూ ఉండగా, శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి మూడడుగులు దానముగా పుచ్చుకుని బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కి వేశాడు అని మన పురాణ కథనం ద్వారా తెలుస్తుంది.

పాతాళానికి వెళ్ళిన బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువును, నువ్వు నా దగ్గర ఒక రూపంతో ఉండాలి అని భక్తితో ప్రార్థించగా…
స్వామి వారు సరే నీకోసము ఒక నాలుగు నెలల పాటు క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకొని నీ దగ్గర ఒక రూపంతో ఉంటాను, అని తన రూపాన్ని రెండుగా విభజించుకున్నాడు.

అందులో ఒక రూపమును బలి చక్రవర్తి దగ్గర పాతాళంలో ఉంచాడు,
మరొకటి క్షీర సముద్రంలో ఉంచాడు.
ఈ విధముగా స్వామివారు రెండు రూపములను ధరించిన అపూర్వమైన తిథియే శయన ఏకాదశి.
బలి చక్రవర్తి స్వామివారిని స్వామీ నువ్వు ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తిక శుక్ల ఏకాదశి వరకు పాతాళ లోకంలో ఉన్న రూపంతో మెలకువగా ఉండి, క్షీర సాగరం లో ఉన్న రూపం నిద్రపోతూ ఉండాలి, ఈ  నాలుగు నెలలు మా పూజలు అందుకోవాలి, ఈ సమయంలో ఎవరైనా భక్తులు నిన్ను పూజిస్తే, నా లోకంలో మెలకువతో ఉన్న రూపంలో నుండి వెళ్లి ఆ భక్తులను అనుగ్రహించాలి, అని కోరగా స్వామి వారు అలాగే అని బలిచక్రవర్తికి వరమిచ్చాడు.
తద్వారా ప్రజలందరూ ఈ విషయం విని స్వామి వారు పాతాళలోకంలోని బలిచక్రవర్తి దగ్గర నుంచి వచ్చారు, ఈ విధముగా నన్ను కూడా తలుచుకుంటారు, దాని వలన నా పుణ్యం పెరిగి ఎల్లప్పుడూ నీ సేవ చేసుకునే భాగ్యం లభిస్తుంది అన్నాడు.

ఈ విధముగా ప్రజలందరూ ఆ వంకతో నిన్ను కూడా తలుచుకోవడం వల్ల నీ పుణ్యం అఖండంగా పెరిగి రాబోయే సావర్ణి మన్వంతరంలో నువ్వు ఇంద్రుడు అవుతావు, ఆ తర్వాత శాశ్వతంగా నా లోకానికి వచ్చేస్తావు అని వరమిచ్చాడు.

ఈ విధముగా బలిచక్రవర్తి కోరిక మేరకు స్వామి వారు వైకుంఠములో ఆదిశేషుని మీద నిద్ర పోవడం వలన ఈ ఏకాదశికి శయన ఏకాదశి అని పేరు వచ్చింది.
స్వామి వారు తన దివ్య లోకంలో నిద్రపోతూ ప్రజల కోసం అధో లోకములలో మెలకువగా ఉండడం వలన ఈ ఏకాదశి మిగిలిన వాటి కంటే విభిన్నమైనది.

*ఆచరించవలసిన విధులు:🌹*
ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, వీలైన వారు మాత్రమే, వీలు కానివారు మితాహారం ( పాలు, పండ్లు, వంటివి తీసుకోవడం చేయాలి )భక్తితో హరిని పూజించి, తులసి దళములను స్వామివారికి సమర్పించిన వాడు ఎంతటి సామాన్యుడైనా, వాడి పాపములన్ని తొలగిపోయి సకల శుభములు పొందుతాడని నమ్ముతారు,

ఏకాదశి నాడు సూర్యోదయాని కంటే ముందే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తలంటు స్నానం చేసి ( స్నానం చేసే నీళ్ళలో రెండు తులసి దళములు, ఒక మారేడు దళం వేసుకుని స్నానం చేస్తే అది గంగా నది వంటి పుణ్య నదీ జలాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది) అని చెబుతారు.
వారి వారి సంప్రదాయాలను అనుసరించి విభూతి కానీ, ఊర్ధ్వ పుండ్రాలు కానీ, కుంకుమ కానీ ధరించి భక్తితో హరి పూజ చేయాలి.

కటిక ఉపవాసం చేయకూడదు కనుక శరీరము నిలబడడానికి అవసరమైన మేర భుజించి ఉపవాసము చేసి ఈరోజు మహాత్ములకు దీపదానము (వెలుగుతున్న దీపంతో) చేయాలి.

ఈరోజు మోదుగ ఆకులతో కుట్టిన విస్తరాకులో భోజనం చేయడం మంచిది అని చెబుతారు,
పూర్తిగా మోదుగ ఆకులతో కుట్టిన విస్తరి దొరకని వాళ్ళు కంచంలో ఒక్క మోదుగాకు వేసుకొని అయినా దాంట్లో భోజనం చేయాలట.

ఈరోజు దీపదానము, మోదుగ ఆకులో భోజనం, హరిపూజ, హరి నామస్మరణ చేసిన వారు హరికి అత్యంత ప్రీతి పాత్రులు అవుతారని చెబుతారు.

ఈ రోజు ఒకటి లేదా రెండు తులసి దళములను,
ఒకటి లేదా రెండు మారేడు దళము లను తమలపాకులో పెట్టి కానీ లేదా వక్కలతో కలిపి కానీ, దక్షిణతో, మహాత్ములకు దానము చేస్తే అటువంటివాడు బలిచక్రవర్తి విష్ణువుకు మూడు అడుగులు దానము చేసి పొందిన మహా ఫలితాన్ని పొందుతారు.
ఏకాదశి నాడు పగటిపూటనిద్ర పోకుండా, బ్రహ్మచర్యం పాటించాలి, అందరితో అన్యోన్యంగా, ప్రేమగా వుండాలి,
ఈ నాడు సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు అఖండ నామ సంకీర్తన చేయడం వల్ల, వారు సకల శుభాలను పొందుతారు…

ఆ రోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అత్యంత విశేష ఫలితం ప్రసాదిస్తుంది.

స్వస్తి 🙏

శుభమస్తు
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏