పర్యావరణ పరిరక్షణలో భాగంగా చైనా (China) కీలక నిర్ణయాలు అమలుచేస్తోంది. ఇప్పటివరకు 300 డ్యామ్‌లను కూల్చివేసింది. ఉన్న 373 హైడ్రోపవర్ స్టేషన్లలో 342 చిన్నస్థాయి హైడ్రోపవర్ స్టేషన్ల కార్యకలాపాలు నిలిపివేసింది..ఒక చేప జీవజాలాన్ని, ఒక నది సహజత్వాన్ని కాపాడేందుకు 2020 నుంచి ఈ చర్యలు తీసుకుంటోందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.
ఆసియాలో అతి పొడవైన యాంగ్జీ నది (Yangtze River).. చైనా ఆహార భద్రత, ఆర్థికవ్యవస్థకు అతి కీలకమైంది. గత కొన్ని దశాబ్దాల కాలంలో చైనా భారీస్థాయిలో డ్యామ్‌లు, హైడ్రోపవర్ ప్రాజెక్టులను నిర్మించింది. అవి జలచరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. యాంగ్జీ ఉపనదుల్లో ఒకటైన చిషుయ్ హే (రెడ్రివర్)ను అరుదైన, స్థానిక చేప జాతులకు ఆవాసంగా పరిగణిస్తారు. అలాంటిది డ్యామ్‌లు, పవర్స్టేషన్లు ఆ నదీ ప్రవాహాన్ని కట్టడి చేశాయి. గతంలో ఈ నది ప్రవహించిన ప్రాంతాలకు నీరందకపోవడంతో ఆ ప్రాంతాలు ఎండిపోయాయి కూడా. జీవవైవిధ్యం దెబ్బతినడం, కొన్ని జాతులు అంతరించేపోయే దశకు చేరుకోవడంపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళనను వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే డ్రాగన్ ఈ చర్యలకు పూనుకుంది.
అల్జీమర్స్.. ‘సర్జరీ చికిత్స’పై చైనా నిషేధం
యాంగ్జీ స్టర్జన్ (Yangtze sturgeon)గా పేరుపొందిన స్టర్జన్ ఫ్యామిలీకి చెందిన చేపను 2022లో అంతరించిపోతున్న జాతిగా ప్రకటించారు. గతంలో అది యాంగ్జీ పరివాహక ప్రాంతమంతా కనిపించేది. 1970 నుంచి స్టర్జన్ సంతతి పడిపోతూ వస్తోంది. డ్యామ్‌ల నిర్మాణం, అతిగా చేపలు పట్టడం వంటివి అందుకు కారణాలయ్యాయి. కాగా.. ప్రస్తుతం రెడ్ రివర్ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌తో అవి మళ్లీ తమ ఉనికిని చాటుతాయనే భావన వ్యక్తమవుతోంది. 2023, 2024లో రెండు బ్యాచ్‌ల యాంగ్జీ స్టర్జన్‌లను నదిలోకి వదలగా.. అవి విజయవంతంగా నదిలో మనుగడ సాగించడం ప్రారంభించాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు..